VANDE BHARAT: వందే భారత్ రైళ్ల పేల్చివేతలకు కుట్ర..!

నలుగురు హైదరాబాదీ జిహాదీల కుట్ర..!

Update: 2026-02-07 06:45 GMT

దేశవ్యాప్తంగా వేగవంతమైన రైళ్లలో ప్రత్యేక గుర్తింపు పొందిన వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల భద్రతపైఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ అత్యాధునిక రైళ్లను లక్ష్యంగా చేసుకుని విధ్వంసకర చర్యలకు కుట్ర జరుగుతోందన్న సమాచారం రైల్వే వర్గాల్లో కలకలం రేపుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని అధికారులకు గుర్తుతెలియని వ్యక్తి నుంచి బెదిరింపు లేఖ అందడంతో భద్రతా వ్యవస్థను మరింత కట్టుదిట్టం చేశారు. రైల్వే జనరల్ మేనేజర్ కార్యాలయానికి పోస్టు ద్వారా వచ్చిన ఈ లేఖలో, హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ఓ తీవ్రవాద బృందం వందే భారత్ రైళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులకు ప్రణాళిక రూపొందించిందని పేర్కొన్నారు. రైళ్లలో బాంబులు అమర్చి పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం కలిగించడమే వారి ఉద్దేశమని లేఖలో హెచ్చరించినట్టు అధికారులు తెలిపారు. ఈ సమాచారంతో అప్రమత్తమైన రైల్వే అధికారులు వెంటనే భద్రతా దళాలను రంగంలోకి దించారు.

లేఖ అందిన వెంటనే రైల్వే రక్షణ దళం, ప్రభుత్వ రైల్వే పోలీసులు, ఇంటెలిజెన్స్ విభాగాలు సమన్వయంతో తనిఖీలు ప్రారంభించాయి. ముఖ్యంగా వందే భారత్ రైళ్లు ఆగే కీలక స్టేషన్లలో భద్రతను పెంచారు. సికింద్రాబాద్, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రధాన రైల్వే కేంద్రాల్లో ప్రయాణికుల రాకపోకలను నిశితంగా గమనిస్తున్నారు. ప్రతి కోచ్‌ను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు రైల్వే ట్రాక్‌ల వెంట కూడా పర్యవేక్షణ కొనసాగుతోంది. డాగ్ స్క్వాడ్‌లు, బాంబ్ స్క్వాడ్ బృందాలు రైళ్లను, ప్లాట్‌ఫారమ్‌లను, స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశీలిస్తున్నాయి. స్టేషన్లలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల ఫుటేజీని విశ్లేషిస్తూ అనుమానాస్పద కదలికలపై ప్రత్యేక నిఘా పెట్టారు. ప్రయాణికుల లగేజీ తనిఖీలను కూడా మరింత కఠినతరం చేశారు. ఎలాంటి అలసత్వం లేకుండా ప్రతి సమాచారం, ప్రతి సూచనను పరిశీలిస్తున్నట్టు అధికారులు తెలిపారు.

Tags:    

Similar News