TIRUMALA: తిరుమలలో అన్యమత ప్రచారం..!
మత ప్రచారం చేస్తూ రీల్స్.. ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు..;
పవిత్ర పుణ్యక్షేత్రం , కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో యథేచ్ఛగా అన్యమత ప్రచారం చేస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు. తిరుమలలో అన్యమత ప్రచారం నిషిద్ధం. తిరుమల పాపవినాశనంలోని రెండు హోటళ్ల మధ్య ఇద్దరు మహిళలు అన్యమత గీతాలు ఆలపిస్తూ రీల్స్ చేయడం వివాదాస్పదమైంది. పాపవినాశనంలో హాకర్లుగా జీవనం సాగించే శంకరమ్మ, మీనాక్షిలు భక్తుల ముందే అన్యమత పాటలు పాడుతూ.. ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్ చేసి, ప్రచారం చేస్తున్నారు. వీరితోపాటు మరికొందరు ఈ విధంగా అన్యమత ప్రచారానికి తెగబడ్డారు.
టీటీడీ విజిలెన్స్ విచారణ
20 మందికి పైగా పాపవినాశనం దగ్గర పాటలతో రీల్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ విషయంలో వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు టీటీడీ రంగంలోకి దిగింది. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ అధికారులు వారిద్దరినీ కొండ నుంచి కిందకు తరలించారు. తిరుమల టూటౌన్ పోలీసులకు తితిదే అధికారుల ఫిర్యాదు మేరకు శంకరమ్మ, మీనాక్షిలపై కేసు నమోదు చేశారు. నిజంగానే పాపవినాశనం దగ్గర అన్య మతస్థులు ప్రచారం చేశారా.. లేక ఇవన్నీ ఒట్టి వదంతులా అనే విషయాన్ని నిర్ధారించేందుకు టీటీడీ విజిలెన్స్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో వాటిపైనా విజిలెన్స్ సిబ్బంది విచారణ చేస్తున్నారు.
అన్యమత ప్రచారం నిషిద్ధం
తిరుమల కొండపై అన్యమత ప్రచారం నిషేధం. ఇతర మతస్థులు స్వామివారిని దర్శించుకోవాలనుకున్నా సరే.. డిక్లరేషన్ ఇచ్చే దర్శనానికి వెళ్లాల్సి ఉంటుంది. తమకు వెంకటేశ్వరస్వామిపై పూర్తి నమ్మకం, విశ్వాసం ఉందంటూ డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే అప్పుడప్పుడూ ఇలా తిరుమల కొండపై అన్యమత ప్రచారం వార్తలు వెలుగుచూస్తుంటాయి. తాజాగా జరిగిన ఘటనలోనూ కూలీ చేసుకునే మహిళలే ఈ రీల్స్ చేసినట్లు అనుమానాలు వస్తున్నాయి. పాపవినాశనం ప్రాంతంలో ఉండే హోటల్స్ వద్ద రీల్స్ చేసినట్లు భావిస్తున్నారు. మరి ఈ అన్యమత ప్రచారం వార్తలు నిజమా కాదా అనే దానిపై టీటీడీ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.