Vishaka Steal Plant: పాక్ హనీట్రాప్ వలలో CISF ఉద్యోగి
నిఘా వర్గాల సమాచారంతో అప్రమత్తమైన విశాఖ సీఐఎస్ఎఫ్ వింగ్;
మనదేశ అంతర్గత వ్యవహారాలను తెలుసుకునేందుకు పాకిస్తాన్ పదే పదే హనీట్రాప్ వల విసురుతూనే ఉంది. తాజాగా విశాఖ జిల్లాలో హనీ ట్రాప్ కలకలం రేపింది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో సీఐఎస్ఎప్ ఉద్యోగికి పాకిస్తాన్ యువతి వల వేసింది. నిఘా వర్గాల సమాచారంతో విశాఖ సీఐఎస్ఎఫ్ వింగ్ అప్రమత్తమైంది. కానిస్టేబుల్ కపిల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకుంది. పాకిస్తాన్ యువతి విసిరిన వలపువలపై...విశాఖ సీఐఎస్ఎఫ్ వింగ్ గోప్యంగా విచారిస్తోంది.
విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్యూరిటీ విధుల్లో సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్ కపిల్ కుమార్ జగదీష్ భాయ్ మురారీ గత కొంతకాలంగా పని చేస్తున్నాడు. కపిల్ కుమార్ గతంలో రక్షణ రంగంలో కీలకమైన బీడీఎల్...భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌లో విధులు నిర్వహించాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ కపిల్ కుమార్‌పై హనీ ట్రాప్ వల విసిరింది. కీలక సమాచారం తెలుసుకునేందుకు ఓ ఉగ్రవాద సంస్థకి చెందిన పెద్ద నాయకుడి పీఏ అయిన తమిషా అనే పాకిస్తాన్ యువతి ద్వారా వ్యవహారం నడిపించింది. సోషల్ మీడియా ద్వారా కపిల్‌తో తమిషా పరిచయం పెంచుకుంది. రెండేళ్ల పాటు ట్రాప్ చేసి భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని రాబట్టింది.
సోషల్‌మీడియా ద్వారా కపిల్ కుమార్‌తో పరిచయం పెంచుకున్న తమిషా...వ్యవహారం న్యూడ్ వీడియో కాల్స్ వరకు వెళ్లింది. ఓ సారి రహస్యంగా కపిల్‌ను ఓ రూమ్‌లో కలిసింది. మెల్లగా భారత్ డైనమిక్స్ లిమిటెడ్‌కు సంబంధించిన కీలక సమాచారాన్నంతా రాబట్టింది. అయితే కపిల్ కుమార్ కదలికలపై ఉన్నతాధికారులకు అనుమానం రావడంతో అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. అంతే విషయం మొత్తం బయటకు వచ్చింది. మొత్తానికి కీలక సమాచారం పాక్ గూఢచార సంస్థకు చేరి ఉంటుందని అధికారుల భావిస్తున్నారు. కపిల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని దానిని సీఐఎస్ఎఫ్ ఫోరెన్సిక్ విచారణకు పంపారు. అతడిపై అధికారిక రహస్యాల ఉల్లంఘన నేరం కింద కేసు నమోదు చేశారు.