Tungabhadra Dam: కొట్టుకుపోయిన తుంగభద్ర గేటు,సీఎం చంద్రబాబు ఆరా

మంత్రి పయ్యావులకు సీఎం చంద్రబాబు ఫోన్;

Update: 2024-08-11 04:45 GMT

కర్ణాటకలో తుంగభద్ర డ్యామ్‌ గేటు కొట్టుకుపోవడంపై ఏపీ సీఎం చంద్రబాబు ఆరా తీశారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం ఆదేశించారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని సీఎంకు సాయిప్రసాద్‌ తెలిపారు. తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్‌ టీమ్‌ను పంపాలని సీఎం సూచించారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. స్టాప్‌లాక్‌ అరేంజ్‌మెంట్‌ ద్వారా నీరు వృథా కాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు

మరోవైపు తుంగభద్ర డ్యామ్‌ అధికారులతో మాట్లాడాలని మంత్రి పయ్యావుల కేశవ్‌ను చంద్రబాబు ఆదేశించారు. తాత్కాలిక గేటు ఏర్పాటుపై డ్యామ్‌ అధికారులతో మాట్లాడాలన్నారు. తగిన సహకారం అందించాలని పయ్యావులకు సూచించారు. తాత్కాలిక స్టాప్‌లాక్‌ గేటు ఏర్పాటుకు ఇబ్బందులున్నాయని పయ్యావుల కేశవ్‌ తెలిపారు. పాత డిజైన్‌ కావడం వల్ల స్టాప్‌లాక్‌ గేట్‌ ఏర్పాటు చేయలేని పరిస్థితి ఉందన్నారు.

సీఎం ఆదేశాలతో ఘటనాస్థలికి ఇంజినీర్ల బృందం, సెంట్రల్‌ డిజైన్‌ కమిషనర్‌ వెళ్లారని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్లను ఆదేశించామన్నారు. కౌతాలం, కోస్గి, మంత్రాలయం, నందవరం ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. శ్రీశైలం, సాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల అధికారులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశామన్నారు.

Tags:    

Similar News