AP: వాచ్‌మెన్ రంగన్న మృతిపై పెరుగుతున్న అనుమానాలు
అనుమానం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి... సమగ్ర విచారణకు ఆదేశం;
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతిపై అనుమానాలు పెరుగుతున్నాయి. రంగన్న మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆయన భార్య సుశీలమ్మ పులివెందుల పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సందర్భంగా వాచ్‌మెన్ రంగన్న భార్య సుశీలమ్మ షాకింగ్ విషయాలు బయటపెట్టింది. పోలీసులు, సీబీఐ వేధింపుల వల్లే తన భర్త రంగన్న అనారోగ్యానికి గురయ్యారని ఆవేదన వ్యక్తం చేసింది. తప్పుచేసింది ఒకళ్లు.. శిక్ష తన భర్త రంగన్నకు వేశారని ఆమె కన్నీరు పెట్టుకుంది. గత ఆరేళ్లుగా పోలీసులు తమ ఇంటి ముందు కాపలా ఉన్నారని తెలిపింది. పోలీసులు సరైన సమయంలో వైద్యంచేయించలేదని..మూడు నెలల నుంచి తన భర్త మంచాన పడ్డారని చెప్పింది. అప్పట్లో తప్పు చేసిన వారిని పట్టుకోకుండా తన భర్తను పట్టుకుని వేధించారని రంగన్న భార్య సుశీలమ్మ వాపోయింది.
అనుమానాలు ఉన్నాయన్న సీఎం
వాచ్‌మెన్ రంగన్న మృతి ముమ్మాటికీ అనుమానాస్పదమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి వాచ్‌మెన్ రంగన్న మృతిపై సుదీర్ఘ చర్చ జరిగింది. వివేకా హత్యకేసు సాక్షులు ఒక్కొక్కరుగా చనిపోతున్న అంశంపై దాదాపు గంటపాటు చర్చ జరిగింది. రంగన్నను పోలీసులే చంపారంటూ తొలుత వార్తలు రావడంపై మంత్రివర్గంలో అనుమానాలు వ్యక్తమయ్యాయి. రంగన్న మృతిని ప్రభుత్వానికి ఆపాదించాలనే కుట్ర ఉందని కొందరు మంత్రులు వ్యాఖ్యానించినట్టు సమాచారం. వాచ్‌మెన్ మృతి వెనుక ఉన్న అనుమానాలను డీజీపీ.. మంత్రులకు వివరించారు. అనుమానాస్పద మృతేనని పోలీసుల విచారణలోనూ నిర్ధరణ అయిందన్నారు. జగన్ కుట్రల పట్ల అప్రమత్తంగా ఉండాలని పదేపదే చెబుతూ వస్తున్నానని గుర్తు చేశారు. పరిటాల రవి హత్యకేసులోనూ సాక్షులు ఇలానే చనిపోతూ వచ్చారని పేర్కొన్నారు. అనుమానాలతో కేసును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే అంశంపై చర్చించారు.
సమగ్ర విచారణకు ఆదేశం
ఆంధ్రప్రదేశ్ కేబినెల్ కీలక నిర్ణయాలు తీసుకుంది.. మాజీ మంత్రి వివేక హత్య కేసులో కీలక సాక్షి రంగన్న మృతిపై ఏపీ కేబినెట్ సమగ్ర విచారణకు ఆదేశించింది. అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులు సహా అభివృద్ధి, సంక్షేమ పథకాలు, పలు శాఖలో పాలనాపరమైన మార్పులపై కీలక నిర్ణయాలు తీసుకుంది. 14 అంశాలకు మంత్రి వర్గం ఆమోద ముద్ర వేసింది.