Vijayawada : ప్రజల ప్రాణాలను కాటేస్తున్న కలుషిత నీరు
వారంలో రోజుల్లోనే కలుషిత నీటి వల్ల నలుగురు మృతి;
విజయవాడలో కలుషిత నీటికి మరొకరు బలయ్యారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం వేమిరెడ్డిపల్లి గ్రామస్థుడు ఇడుపులపాటి కళ్యాణ్ .. ఇటీవల నగరానికి ఉపాధి కోసం వచ్చారు. ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తూ.. విజయవాడలోని మొగల్రాజపురంలో అద్దెకు ఉంటున్నారు. రెండు రోజుల క్రితం స్నేహితులతో కలిసి ఇంట్లో భోజనం చేశారు. ఇంటి వద్ద నీరు తాగడంతో నలుగురూ అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలు ఎక్కువ కావడంతో ఈనెల 27న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.... చికిత్స పొందుతూ కళ్యాణ్ మంగళవారం చనిపోయారు. అతడి మృతదేహాన్ని వెంటనే స్వగ్రామానికి పంపి అధికారులు చేతులు దులుపుకొన్నారు. మిగిలిన ముగ్గురూ చికిత్స అనంతరం కోలుకున్నారు.
విజయవాడ మొగల్రాజపురంలో ఇటీవల వల్లూరు దుర్గారావు వాంతులు, విరేచనాలతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నెల 21న ఇదే కాలనీకి చెందిన శిఖా ఇందిర మరణించగా... ఈ నెల 26న కాకర్ల ఏసుదాసు భార్య కాకర్ల ఇందిర కూడా చనిపోయారు. ఇడుపులపాటి కళ్యాణ్ ఇంటి పక్కనే ఈమె నివాసం ఉన్నారు. ఈ ప్రాంతంలో ఒకే రకమైన కలుషిత నీరు వచ్చిందనడానికి ఇదే నిదర్శనమని.. వీరు ఆ కలుషిత నీటిని తాగడం వల్లనే చనిపోయారని స్థానికులు ఆరోపిస్తున్నారు.
పేదలు కలుషిత నీరు తాగి చనిపోతుంటే.. అధికారులు మాత్రం వీరివి సహజ మరణాలని కొట్టిపారేస్తున్నారు. కనీసం మానవత్వం కూడా చూపని దుస్థితి నెలకొంది. వీఎంసీ కమిషనర్ స్వప్నిల్ దినకర్ ఈ మరణాలను కలుషిత నీటిని తాగడం వల్ల జరిగినవని అంగీకరించడం లేదు. ఇవి కలుషిత నీటి వల్ల కాదనీ.. ఇతర అనారోగ్య సమస్యలతో మరణించారని చెబుతున్నారు. వల్లూరు దుర్గారావు వాంతులు, విరేచనాలతో మరణిస్తే.. వీఎంసీ కమిషనర్ మాత్రం ఆయనకు అనారోగ్యం ఉందనీ, మూర్చ వ్యాధి ఉందంటూ ఓ ప్రకటన విడుదల చేశారు. మిగిలిన ముగ్గురి మరణాలను అసలు ధ్రువీకరించడం లేదు. కళ్యాణ్ జీజీహెచ్‌లో మరణిస్తే.. కనీసం పోస్టుమార్టం కూడా చేయకుండా పంపేశారు. వాంతులు, విరేచనాలతో చేరినట్లు మాత్రం సర్టిఫికెట్ ఇచ్చారు.