ఆంధ్రప్రదేశ్ లో మెగా డీఎస్సీ (DSC) పరీక్షల ప్రక్రియ విజయవంతంగా ముగిసింది... అనేక అడ్డంకులను అధిగమించి కేవలం 23 రోజుల వ్యవధిలో నే ప్రక్రియను సజావుగా పూర్తి చేశామని విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ... మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు వైసీపీ తీవ్రంగా కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. మొత్తం 31 కోర్టు కేసులు వేసి ప్రక్రియను నిలిపివేయాలని చూసినప్పటికీ.. వాటన్నింటినీ అధిగమించి పారదర్శకంగా, నిష్పాక్షికంగా పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
మెగా డీఎస్సీకి రాష్ట్రవ్యాప్తంగా అభ్యర్థుల నుంచి విశేష స్పందన లభించిందని లోకేశ్ వివరించారు. మొత్తం 3.36 లక్షల మంది అభ్యర్థులు 5.77 లక్షల దరఖాస్తులు చేయగా, వారిలో 92.9 శాతం మంది పరీక్షలకు హాజరయ్యారని వెల్లడించారు. ఎస్సీ ఉప వర్గీకరణ, స్పోర్ట్స్ కోటా వంటి అన్ని నిబంధనలను పక్కాగా అమలు చేశామని ఆయన వెల్లడించారు.
ఈ మెగా డీఎస్సీ ప్రక్రియను విజయవంతం చేసిన విద్యాశాఖ అధికారులందరికీ ఈ సందర్భంగా మంత్రి లోకేశ్ అభినందనలు తెలిపారు. ఇప్పటికే ప్రాథమిక 'కీ'ని విడుదల చేశామని, అభ్యర్థుల నుంచి వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత త్వరలోనే తుది 'కీ'ని కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు.