Dhavaleswaram: పడకేసిన పారిశుద్ధ్యం
డంపింగ్ యార్డును తలపిస్తున్న ధవళేశ్వరం
గోదావరి తీరంలోని ఆధ్యాత్మిక కేంద్రం ధవళేశ్వరంలో పారిశుద్ధ్యం పడకేసింది. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో చెత్త కుప్పలుగా పేరుకుపోయింది. ఇటీవల కురిసిన వర్షాలకు పేరుకుపోయిన చెత్తా, చెదారం నుంచి దుర్వాసన వస్తున్నా అధికార యంత్రాంగం స్పందించడం లేదు. దోమలు దండయాత్ర చేస్తున్నా....పంచాయతీ సిబ్బంది పట్టించుకోవడం లేదు.
రాజమహేంద్రవరం గ్రామీణ మండలం ధవళేశ్వరం దాదాపు 70వేల జనాభా ఉన్న అతిపెద్ద పంచాయతీ. చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రమైన ధవళేశ్వరానికి చుట్టుపక్కల గ్రామాల నుంచీ పెద్దఎత్తున వివిధ పనులపై వస్తుంటారు. ఇంత జనాభా ఉన్న ఊరిలో గత కొన్నేళ్లుగా పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. ముఖ్యంగా గోదావరి కాలువల వెంట వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. మెండా వారి వీధి, ఉడతా వారి వీధి, కాటన్ పేట, లక్ష్మీ జనార్థన నగర్, జాలరుపేట, పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో చెత్త ఎక్కడిక్కడ పేరుకుపోతోంది. పాత గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద పెద్దఎత్తున చెత్త దర్శనమిస్తోంది. మురుగు కాల్వల్లో చెత్త పేరుకుపోవడంతో దుర్వాసన వస్తోంది.
కాలనీల్లోని ఖాళీ స్థలాల్లో స్థానికులు చెత్త వేయడంతో వాటిని తొలగించే వారు లేక పెద్దఎత్తున పేరుకుపోతోంది. ఇక వీధుల్లో వేస్తున్న చెత్తను తొలగించే వారే లేరు. పంచాయతీ సిబ్బంది పట్టించుకోకపోడంతో ఏ వీధిలో చూసినా గుట్టలుగా చెత్త దర్శనమిస్తోందని స్థానికులు వాపోతున్నారు. పంచాయతీ సిబ్బంది చెత్తను సేకరించినా...దాన్ని తరలించేందుకు డంపింగ్‌యార్డు లేకపోవడం తీవ్ర సమస్యగా మారింది. డంపింగ్ యార్డ్ స్థలం వివాదంలోఉంది. దీంతో సేకరించిన చెత్తను జాతీయ రహదారి పక్కన, తూర్పు డెల్టా కాల్వ గట్టున వేస్తున్నారు. లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాల్వలు...చెత్తతో నిండిపోతున్నాయి. పారిశుధ్యం అస్తవ్యస్తంగా మారడంతో జనం రోగాల బారిన పడుతున్నారు..డంపింగ్‌యార్డు సమస్య పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని ప్రైవేట్ స్థలం కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తున్నా ఆ వ్యవహారం కొలిక్కిరాకపోవడం వల్ల్లే రోజువారీ వ్యర్థాల తొలగింపు ఇబ్బందిగా మారిందని అధికారులు తెలిపారు.