ఏపీలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్ పథకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు
రేషన్ పంపిణీలో రాజకీయ పార్టీల రంగులు కనిపించకూడదని స్పష్టం చేసింది. అలాగే నేతల జోక్యం కూడా ఉండకూడదని హైకోర్టు పేర్కొంది;
ఏపీలో నేటి నుంచి ప్రారంభం కానున్న ఇంటింటికీ రేషన్ పథకంపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ పథకానికి సంబంధించి ఎన్నికల కమిషన్ ఇచ్చిన ఆదేశాలపై హైకోర్టులో ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. దానిపై విచారణ జరిపింది ధర్మాసనం. రాజకీయ పార్టీలు, నేతల జోక్యం లేకుండా పథకం నిర్వహించాలని ఆదేశించింది. ఎన్నికల ప్రక్రియలో ఎస్‌ఈసీ రథసారథి అని స్పష్టం చేసింది.. ప్రతి ప్రభుత్వ చర్యతోపాటు పథకాలపై పర్యవేక్షణ ఎస్‌ఈసీదేనని కోర్టు తేల్చి చెప్పింది.
ప్రభుత్వం తరపున ఏజీ శ్రీరామ్ వాదనలు వినిపించగా.. ఎస్‌ఈసీ తరపున అశ్వినికుమార్ వాదనలు వినిపించారు. ఈ పథకం ప్రభావం, బలహీనవర్గాలకు ప్రయోజనం వంటి వివరాలను ఎస్‌ఈసీ పరిగణనలోకి తీసుకుందన్నారు. అధికార పార్టీకి చెందిన రంగులున్న వాహనాలను వినియోగించడంపై ఫిర్యాదులందాయని.. పూర్తి వివరాలతో ప్రభుత్వం ఆశ్రయిస్తే ఎస్‌ఈసీ పరిశీలిస్తుందని అశ్వినికుమార్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.. దీంతో రేషన్ పంపిణీకి సంబంధించిన ప్రణాళిక తయారు చేసుకుని రెండ్రోజుల్లో ఎస్ఈసీని కలవాలని హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఐదు రోజుల్లో ఈ అంశంపై ఎస్ఈసీ నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం ఆదేశించింది.
రేషన్ పంపిణీలో రాజకీయ పార్టీల రంగులు కనిపించకూడదని స్పష్టం చేసింది. అలాగే నేతల జోక్యం కూడా ఉండకూడదని పేర్కొంది. ఈ సందర్భంగా హైకోర్టు ధర్మాసనం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.. ప్రజా సంక్షేమ పథకాలు సొంత డబ్బులతో ఎవరూ చేయరని.. ట్యాక్స్ పేయర్స్ డబ్బుతో పథకాలు నిర్వహిస్తారనేది గుర్తుంచుకోవాలని స్పష్టం చేసింది. పేద ప్రజల కోసం పథకం కాబట్టి ఎస్ఈసీ కూడా సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. అవసరమైతే సీఎస్, ఇతర అధికారులు వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని ఎస్‌ఈసీకి కోర్టు సూచించింది.