టచ్ చేస్తే భూస్థాపితం అవుతావ్ : అయ్యన్న పాత్రుడు
ESI స్కాం కేసులో అచ్నెన్నాయుడిని నోటీసు ఇవ్వకుండా అన్యాయంగా అరెస్టు చేశారన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఈ స్కాంలో అసలు సూత్రధారి కార్మిక శాఖ మంత్రి జయరాం..;
ESI స్కాం కేసులో అచ్నెన్నాయుడిని నోటీసు ఇవ్వకుండా అన్యాయంగా అరెస్టు చేశారన్న మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు.. ఈ స్కాంలో అసలు సూత్రధారి కార్మిక శాఖ మంత్రి జయరాం అంటూ ఆరోపణలు చేశారు. ఈ కేసులో A-14గా వున్న కార్తీక్.. జైలు నుంచి విడుదలయ్యాక మంత్రి కుమారుడు ఈశ్వర్‌కు బర్త్ డే గిఫ్ట్‌గా ఖరీదైన కారు అందించారన్నారు. A-14 తన ఫేస్‌బుక్‌లో పెట్టుకున్న ఫొటోలను అయ్యన్న మీడియాకు చూపించారు. 2019 డిసెంబర్‌లో గిఫ్ట్ ఇవ్వాల్సిన అవసరం ఏముందని ఆయన ప్రశ్నించారు. తాము మోపుతున్న అభియోగాలపై ఆధారాలు కూడా సిద్ధంగా ఉన్నాయన్నారు. మంత్రి జయరాంని పదవి నుంచి తప్పించాలని అయ్యన్న డిమాండ్ చేశారు.
కార్తీక్.. మినిస్టర్ కుమారుడికి ఇచ్చింది పుట్టిన రోజు గిఫ్ట్ కాదని.. ముమ్మాటికీ లంచమే అన్నారు అయ్యన్న. తమ ఆరోపణలపై సీఎం జగన్ స్పందించాలని.. బీసీలను ఏ ఆధారాల్లేకుండా టచ్ చేస్తే భూ స్థాపితమవుతావని ఘాటుగా హెచ్చరించారు. ఎక్కడైనా అవినీతి జరిగితే సీఎం జగన్ 14400 కి ఫోన్ చెయమన్నారన్న అయ్యన్న.. మీడియా సమావేశంలోనే ఆ నెంబర్‌కు ఫోన్ చేశారు.
మంత్రి జయరాం అక్రమాల్లో జగన్ పాత్ర ఉందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ బాంబ్ పేల్చారు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ. ఏ-14 కార్తీక్ పేరుపై వున్న కారుని జయరాం కొడుకు ఎమ్మెల్యే స్టిక్కర్ వేసుకుని తిరగడం నిజం కాదా అని ప్రశ్నించారు. జయరాం అక్రమాలను ఆధారాలతో సహా నిరూపిస్తామని.. సన్యాసం తీసుకోవడానికి సిద్ధమా అని సుజాతమ్మ సవాల్ విసిరారు.
అటు.. ఈ స్కామ్‌లో A 14 గా ఉన్న వ్యక్తి ఇచ్చిన కారు తీసుకుని... అతణ్ని రక్షించడానికి మంత్రి ప్రయత్నిస్తున్నారని తేలిపోయిందన్నారు టీడీపీ నేతలు బుద్ధా వెంకన్న, బచ్చుల అర్జునుడు. అయ్యన్నపాత్రుడితో చర్చకు సిద్ధమంటున్న మంత్రి జయరామ్.. ఎప్పుడు, ఎక్కడికి రావాలో చెప్పాలని సవాల్ విసిరారు. బెంజ్ మినిస్టర్ జయరామే ESI స్కామ్ వెనుక అసలైన సూత్రదారి అంటూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్వీట్ చేశారు. పనులు లేక కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. కార్మిక శాఖ మంత్రి జయరాం మాత్రం ESI స్కామ్ లో నిందితుడు ఇచ్చిన బెంజ్ కారులో విలాసంగా తిరుగుతున్నారని ఆరోపించారు.
అయ్యన్న చేసిన ఆరోపణలపై మంత్రి జయరాం వింత వాదన చేశారు. ఏ14 కార్తీక్, తన కుమారుడు హైదరాబాద్‌లో కలిసారని చెప్పారు. కారు కొన్నాను.. నీ చేతులతో కీస్ ఇస్తే బాగుంటుంది అని కార్తీక్ కోరితేనే.. తన కుమారుడు ఈశ్వర్.. కారు కీ ఇచ్చాడని చెప్పారు. ఈఎస్‌ఐ స్కామ్‌లో కార్తీక్ ముద్దాయి అని ముందు మాకు తెలుసా? అంటూ టీడీపీని ఎదురు ప్రశ్నించారు. మొత్తానికి ESI స్కాం కేసులో మంత్రిపై అయ్యన్నపాత్రుడు చేసిన ఆరోపణలు రాజకీయంగా కాక రేపాయి. ముందు ముందు ఏ కేసు ఎలాంటి మలుపులు తీసుకుంటుందో చూడాలి.