Dhavaleswaram Barrage : గోదావరికి వరద ఉధృతి.. ధవలేశ్వరం గేట్ల ఎత్తివేత..
ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పోటెత్తుతున్నాయి. కృష్ణానదిలో వరద ప్రవాహం ఎక్కువ కావడంతో నిన్ననే శ్రీశైలం డ్యాం గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. కాగా గోదావరి నదిలో కూడా వరద ప్రవాహం పెరుగుతూ వస్తోంది. దీంతో అప్రమత్తమైన అధికారులు ధవలేశ్వరం బ్యారేజ్ వద్ద గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
మహారాష్ట్ర, తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. వరదలు ఎక్కువ కావడంతో గోదావరి నదిపై ఉన్న అన్ని ప్రాజెక్టు ల గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో గోదావరి నదిపై చివరి బ్యారేజ్ అయిన ధవలేశ్వరానికి వరద పోటెత్తడంతో అప్రమత్తమైన అధికారులు ధవలేశ్వరం వద్ద ఉన్న 175 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో 2,00,600 క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి పరుగులు తీస్తుంది. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నీటి మట్టం 9.90 అడుగులకు చేరింది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో.. ధవళేశ్వరం బ్యారేజ్ సహా.. వరద నీరు సముద్రంలో కలిసే ప్రాంతంలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు.