ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాలు కొనసాగుతున్నాయి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ద్రోణి ప్రభావంతో కోస్తాల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కంటిన్యూ అయ్యే చాన్సుంది. రాయలసీమలోను చెదురుమదురుగా వర్షాలు పడతాయి. వచ్చే 24 గంటల్లోనూ ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. శనివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.
ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలోని పలు జిల్లాలలో జూలై 31 వ తేదీ వరకు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కొన్నిచోట్ల బలమైన గాలులు వీచే అవకాశం కూడా ఉన్నట్టు చెప్పింది. గోదావరి వరద నేపథ్యంలో గోదావరి పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. అత్యవసర సహాయ చర్యల కోసం స్టేట్ కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ 1070, 112, 1800425 0101 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.
ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది.