AP: రైతులను నిలువునా ముంచిన అకాల వర్షం
ఏపీలోని పలు జిల్లాల్లో తీవ్ర పంట నష్టం... నష్టాన్ని అంచనా వేయాలని అచ్చెన్నాయుడు ఆదేశం;
ఆంధ్రప్రదేశ్ రైతులను అకాల వర్షం.. నిలువునా ముంచేసింది. అకాల వర్షానికి ఈదురుగాలులు తోడవడంతో ఏపీలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర పంట నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. రూ.36.11 కోట్ల విలువైన పలు రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. అరటి, బొప్పాయి, మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. అనంతపురం జిల్లా పుట్లూరు, యల్లనూరు, యాడికి, శింగనమల మండలాల్లోని 557.20 హెక్టార్లలో రూ.34.82 కోట్ల విలువైన అరటి పంట దెబ్బతింది. శ్రీసత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో 110.5 హెక్టార్లలో చేతికొచ్చిన రూ.1.20 కోట్ల విలువైన అరటి పంట దెబ్బతింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో ఈదురుగాలులకు వడగండ్లు కూడా తోడవడంతో అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడులు వచ్చే సమయానికి పంట నేలమట్టమైదని రైతులు వాపోతున్నారు. వడగళ్ల వానతో దెబ్బతిన పంట నష్టాన్ని అంచనా వేయాలని మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు.
రైతులకు పరిహారం అందిస్తామన్న మంత్రి
ధర్మవరం నియోజకవర్గంలో పంట నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని మంత్రి సత్యకుమారి యాదవ్ అధికారులకు ఆదేశించారు. ధర్మవరం నియోజకవర్గ బిజెపి ఇన్చార్జ్ హరీష్ కుమార్ మాట్లాడుతూ ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని తాడిమర్రి మండలం దాడి తోట నాయన పల్లి తురకవారి పల్లి గ్రామాల్లో అకాల వర్షం కారణంగా అరటి తోట దెబ్బతినడంతో మంత్రి దృష్టికి తీసుకెళ్లగా తక్షణమే సహాయం అందించాలని ఆదేశించినట్లు తెలిపారు.
పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
చందుర్తి మండలం దేవుని తండ, జలపతి తండాలో కురిసిన వడగళ్ల వానతో నష్టపోయిన రైతులకు ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మనో ధైర్యాన్ని కల్పించారు. ఎమ్మెల్యే పంట పొలాలను పరిశీలించి, రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వెంట రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ చేలుకల తిరుపతి, మాజీ జడ్పీటీసీ నాగం కు, బీసీ నాయకులు ఇప్ప మహేష్, కేశిరెడ్డి నర్సారెడ్డి, రాజలింగం, తదితరులు రైతులు, నాయకులు ఉన్నారు.