AP: కేంద్ర నిధులనూ వినియోగించుకోని జగన్‌ సర్కార్‌

Update: 2024-05-26 04:00 GMT

కేంద్ర నిధులను ఉపయోగించుకోవాలని ఏ రాష్ట్రమైనా ఆరాటపడుతుంది. కానీ జగన్‌ ప్రభుత్వం మాత్రం ఇందుకు విరుద్ధంగా.. నిర్లక్ష్య ధోరణి చూపింది. జలజీవన్‌ మిషన్‌ - జేజేఎం పథకం కింద కేంద్రం రాష్ట్రానికి కేటాయించిన నిధులను సకాలంలో వినియోగించుకోలేదు. ఫలితంగా గత రెండేళ్లలో 5 వేల 736 కోట్లు కోల్పోవాల్సి వచ్చింది. గ్రామాల్లో ఇంటింటికీ రక్షిత నీటిని అందించాలని జేజేఎం పథకం కింద కేంద్రం నిధులిస్తోంది. 2019-29లో రాష్ట్రానికి 15 వేల 300 కోట్ల అంచనాలతో ప్రాజెక్టు మంజూరుచేసింది. రాష్ట్రవాటాగా 50 శాతం నిధులు సమకూరిస్తే.. కేటాయించిన దాంట్లోంచి కేంద్రం అంతే మొత్తంలో విడుదల చేస్తుంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా సమకూర్చడంలో మొదటి నుంచీ ఉదాసీనంగా వ్యవహరిస్తోంది. కేంద్రం నుంచి 10వేల 200 కోట్ల విలువైన పనులకు పరిపాలన అనుమతులు తీసుకున్నా ...ఐదేళ్లలో 4వేల 200 కోట్ల విలువైనవే పూర్తి చేయగలిగింది. ఇంత జరిగినా కేంద్రం ఏటా రాష్ట్రానికి నిధులు వినియోగించుకోవాలని గుర్తుచేస్తూనే ఉంది. ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం వీడ లేదు. దీంతో జేజేఎం పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఇప్పటికే దాదాపు 12 వందల కోట్ల బిల్లులు గుత్తేదారులకు చెల్లించాలి. పెండింగ్‌ బిల్లుల జాప్యంతో గుత్తేదారులు పనులు నిలిపేస్తున్నారు.

Tags:    

Similar News