JANASENA: జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విచారణ పూర్తి
అధిష్టానం నిర్ణయమే ఫైనల్
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఓ మహిళను మోసం చేశారన్న ఆరోపణలపై జనసేన త్రిసభ్య కమిటీని నియమించిన విషయం తెలిసిందే. నేడు ఎమ్మెల్యేను త్రిసభ్య కమిటీ విచారించింది. బాధితురాలు చేసిన ఆరోపణల్లో నిజానిజాలేంటో కమిటీ ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన అరవ శ్రీధర్.. తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను త్రిసభ్య కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. తనపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందన్నారు. కాగా.. కొద్దిరోజులుగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై ఓ మహిళ లైంగిక ఆరోపణలు చేస్తోంది. తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి శారీరకంగా వాడుకున్నారని, ఇప్పుడు మొఖం చాటేస్తున్నారని జనసేన ఎమ్మెల్యేపై వచ్చిన ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రదుమారం రేపాయి. ఈ క్రమంలో అరవ శ్రీధర్ వ్యవహారంపై జనసేన అధిష్ఠానం సీరియస్ అయింది. ఆరోపణలపై విచారణ చేసేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది.