TADIPATRI: పెద్దారెడ్డే నా  శత్రువు : జేసీ ప్రభాకర్ రెడ్డి

పోలీసుల కళ్లు గప్పి తాడిపత్రిలో ప్రత్యక్షమైన కేతిరెడ్డి పెద్దారెడ్డి;

Update: 2025-06-30 05:30 GMT

అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో వైసీపీ నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి వ్యాఖ్యలు చేయటంతో అతను తాడిపత్రి రాకుండా పోలీసులు ఆంక్షలు విధించారు. ఆదివారం కేతిరెడ్డి పోలీసుల కళ్లుగప్పి అతని ఇంట్లో ప్రత్యక్షమయ్యారు. విషయం తెలుసుకున్న మున్సిపల్‌ ఛైర్మన్‌, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి.. పెద్దారెడ్డి ఇంటికి బయలుదేరారు. పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టేందుకు టీడీపీ కార్యకర్తలు యత్నించటంతో పోలీసులు అడ్డుకున్నారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి ఇళ్ల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘర్షణ జరిగే అవకాశం ఉండటంతో పెద్దారెడ్డిని అనంతపురం తీసుకెళ్లారు. ఈ ఘటనపై జేసీ మాట్లాడుతూ..తమకు శత్రువు పెద్దారెడ్డి మాత్రమేనని, వైసీపీ కార్యకర్తలు కాదన్నారు. వైసీపీ కార్యకర్తలను ఏమీ అనలేదని.. పెద్దారెడ్డి ఇళ్ళు రిజిస్ట్రేషన్ తప్పని.. ఆ ఇంటికి ప్లాన్ లేదని జేసీ ఆరోపించారు. కేతిరెడ్డి వెంట వచ్చిన వైసీపీ కార్యకర్తల ఫోటోలు తన దగ్గర ఉన్నాయని వీరిని రప్పా రప్పా ఆడిస్తామన్నారు. సోమవారం నుంచి పెద్దారెడ్డి ఇంటిదగ్గర వైసీపీ కార్యకర్తలు ఉంటే తమ కార్యకర్తలు రప్పా రప్పా అంటే ఎలా ఉంటుందో చూపిస్తారని జేసీ తెలిపారు. 

పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ హింసా, రాజకీయాలు'

ఈ ఘటనపై కేతిరెడ్డి పెద్దారెడ్డి  మాట్లాడుతూ.. తనను చూసి జేసీ ప్రభాకర్ రెడ్డి భయపడుతున్నారన్నారు. తాను తాడిపత్రిలో ఉంటే జేసీ ఆగడాలు సాగవని టీడీపీ నేతలు భావిస్తున్నారన్నారు. సీఎం బాబు, మంత్రి లోకేష్ కాళ్లు పట్టుకుని జేసీ పబ్బం గడుపుకుంటున్నారని ఆరోపించారు. పోలీసులను అడ్డుపెట్టుకుని జేసీ ప్రభాకర్ రెడ్డి హింస, రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్నారు. తన ఆస్తులను జేసీ టార్గెట్ చేశారని.. అన్ని డాక్యుమెంట్లతో ఇళ్లు కట్టుకున్నానని.. తాను  స్థలం ఆక్రమించలేదన్నారు. తనపై జేసీ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కేతిరెడ్డి ఆరోపించారు.

కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి.. ఎన్నికల్లో తాను విజయం సాధించినా, ఓడిపోయినా.. తాడిపత్రిలో మాత్రం ఫ్యాక్షనిజం చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో కేతిరెడ్డి తాడిపత్రి రాకుండా జేసీ వర్గీయులు అడ్డుకోవటంతో హైకోర్టును ఆశ్రయించాడు. అయితే కేతిరెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతించగా.. కేతిరెడ్డి న్యాయస్థానం ఆదేశాలు పాటించకపోవడంతో.. కొన్నిరోజుల క్రితమే ఆయన కోర్టు ధిక్కార పిటిషన్ దాఖలు చేశారు. కేతిరెడ్డి తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా తాడిపత్రి రావడంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేసి ఆయన నివాసంలోనే కేతిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు వెల్లడించారు.

Tags:    

Similar News