NV Ramana: తెలుగు భాష సంగీతంలా ఉంటుంది
మాతృభాషలోనే అన్ని నిర్ణయాలు ఉండాలన్న జస్టిస్ యన్.వి.రమణ;
ఆరో ప్రపంచ తెలుగు రచయితల మహా సభలో సుప్రీంకోర్టు పూర్వపు న్యాయమూర్తి జస్టిస్ యన్.వి.రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని దేశాల్లో వారి మాతృభాషలో విద్యాబోధన చేసి అద్భుతాలు సాధించారని వెల్లడించారు. వారి సాంకేతికతను, విజయాలను వారి భాషలోనే రాసుకున్నాయన్నారు. భవిష్యత్తుతరాలకు మాతృభాషపై ఒక గౌరవం కలిగించాయన్నారు. ఆ తరహాలో మన తెలుగు భాషకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. తెలుగు భాష కీర్తి పతాకను ఎగుర వేసెలా సభలు నిర్వహిస్తున్న అందరికీ తెలుగు బిడ్డగా కృతజ్ఞతలు తెలియజేశారు. తెలుగు సాహిత్యం, వైభవం గురించి అనర్గళంగా ఇక్కడ మాట్లాడారన్నారు. తెలుగు జాతి అంటే మదరాసీలు కాదని తెలుగు రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు ప్రాణాలు విడిచారన్నారు.
తెలుగు అతి ప్రాచీన భాష
వంద బిలియన్లు మన తెలుగు భాషను మాట్లాడుతుంటారని.. తెలుగు ఉనికి అతి ప్రాచీన భాషగా గుర్తింపు పొందిందని జస్టిస్ యన్.వి.రమణ అన్నారు. పురాణాలు, ఇతిహాసాలు దాటి ప్రజల భాషగా తెలుగు భాష మారిందన్నారు. ఒక సంగీతం తరహాలో అందమైన భాష తెలుగు భాష అని కొనియాడారు. వ్యాపార, రాజకీయ ప్రయోజనాలతో తెలుగు భాషను అణగదొక్కారని విమర్శించారు. తగినంత గుర్తింపు కూడా భాషకు దక్కలేదన్నారు. వాడుక భాషలో మనం ఇంకా ప్రజలకు దగ్గర కాలేదని.. తెలుగు భాష వృద్ధిపై మన ప్రభుత్వాలు దృష్టి పెట్టింది లేదన్నారు.
తెలుగు మరచిపోవద్దని పిలుపు
విశ్వవ్యాప్తంగా ఉన్న తెలుగువారు మన సంస్కృతి, భాషను మరిచిపోకూడదని.. తెలుగు జాతి కీర్తి ప్రతిష్ఠలు నిత్యం వెలుగొందాలని కోరుకునే వ్యక్తిని తానని జస్టిస్ యన్.వి.రమణ అన్నారు. తెలుగు భాషను దేశంలో వంద మిలియన్లకు పైగా మాట్లాడతారన్నారు. తెలుగుభాష పలుకుబడి వినసొంపైనదని జస్టిస్ ఎన్వీ రమణ వెల్లడించారు. సామాన్య ప్రజలు కూడా కవితా ధోరణిలో మాట్లాడగలిగే అందమైన భాష తెలుగని కొనియాడారు.