LOKESH: జగన్ తప్పు చేశాడు... మూల్యం చెల్లించకతప్పదు
నారా లోకేశ్ హెచ్చరిక.... పవన్ అన్నగా అండగా నిలబడ్డారని వ్యాఖ్య;
సైకో జగన్ చేసిన అతిపెద్ద తప్పు చంద్రబాబు జోలికి రావడమని.. దీనికి రాజకీయంగా, వ్యక్తిగతంగా చాలా మూల్యం చెల్లించబోతున్నాడని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ హెచ్చరించారు. స్కిల్ డెవల్‌పమెంట్ స్కాం పేరుతో దొంగ కేసు పెట్టి చంద్రబాబును జైలుకు పంపాడని డబ్బు ఆయనకు ఎక్కడ నుంచి, ఎలా వచ్చిందో నిరూపించగలవా అని సూటిగా ప్రశ్నించారు. టీడీపీ సీనియర్ నేతలతో కలసి ప్రాంతీయ, జాతీయ మీడియాతో లోకేశ్ మాట్లాడారు. ‘జగన్.. అసలు నీ చరిత్ర ఏంటి? నీపై 37 కేసులు ఎందుకు ఉన్నాయో ప్రజలకు చెప్పగలవా’?అని నిలదీశారు. చంద్రబాబు ప్రజలు, రాష్ట్రం, దేశం గురించి తప్ప వేరేవాటి గురించి ఎప్పుడూ ఆలోచించని వ్యక్తని, అవినీతి అనేది ఆయన రక్తంలోనే లేదని చెప్పారు. చంద్రబాబుపై తప్పుడు ఆరోపణ చేసి దొంగ కేసు పెట్టి ఏకంగా జైలుకు పంపించింది సైకో ప్రభుత్వం. అందుకే ఎప్పుడూ లేనివిధంగా ప్రజల స్పందన వచ్చింది. టీడీపీ ఇచ్చిన బంద్ పిలుపునకు ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సహకరించారని లోకేశ్ అన్నారు.
టీడీపీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, నేను అన్నగా భావించే పవన్‌కు, సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, ఎంఆర్‌పీఎస్ నేత మంద కృష్ణ మాదిగకు లోకేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. చంద్రబాబుపై అవినీతి మరక వేయడానికి సైకో జగన్ ప్రయత్నిస్తున్నాడని.. కానీ జనమెవరూ నమ్మడం లేదని అన్నారు. జోహో సీఈవో శ్రీధర్ వంటి ప్రముఖులు, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వంటి నేతలు ఈ కేసును ఖండించారని లోకేశ్ తెలిపారు.
జగన్‌పై 37 కేసులు ఉన్నాయని, అవి పదేళ్లుగా ట్రయల్‌కు కూడా రావడం లేదంటే వ్యవస్థలను జగన్ ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తున్నాడో ప్రజలందరికీ అర్థమవుతోందని లోకేశ్ తెలిపారు. అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే శాంతిభద్రతల సమస్య ఉందని చెప్పి, పోలీసులను అడ్డుపెట్టి, అరెస్టు కాకుండా ఈ సైకో ఆపగలిగాడని లోకేశ్ విమర్శించారు. చంద్రబాబుకు డబ్బులు ఎక్కడ నుంచి వచ్చాయో ఇప్పుడైనా మీరు నిరూపిస్తారా? ఫలానా అకౌంట్లకు, లేదా ఫలానా షెల్ కంపెనీలకు చంద్రబాబు, ఆయన బినామీలు డైరెక్టర్లుగా ఉన్నారని రుజువు చేస్తారా? ప్రజలకు ఒక పరిశ్రమను తీసుకొస్తేనో, ఉద్యోగాలు కల్పిస్తేనో, ఓ పెద్ద సంక్షేమ కార్యక్రమం చేస్తేనో మంత్రులు సంబరాలు చేసుకుంటారు. కేక్ కటింగ్ చేసుకుంటారు. కానీ ప్రతిపక్ష నేతపై దొంగ కేసు పెట్టి జైలుకు పంపించి సంబరాలు చేసుకునే పరిస్థితికి ఈ మంత్రులు వచ్చారంటే ఎంత కక్షతో ఈ కేసు పెట్టారో ప్రజలంతా ఒకసారి ఆలోచించాలని లోకేశ్ అన్నారు.
సీఐడీ అనేది కక్షసాధింపు డిపార్ట్‌మెంట్‌గా మారిపోయింది. ఇక్కడ కూర్చున్నవారిపై కూడా దొంగ కేసులు పెట్టిందని మండిపడ్డారు. మంత్రులు తొందరలోనే తనన అరెస్ట్ చేస్తామని అంటున్నారని, తాను రాజమండ్రిలోనే ఉన్నానని, ఎక్కడికీ పారిపోలేదని లోకేశ్ అన్నారు. న్యాయం నిలబడే వరకూ వదలనని సైకో జగన్‌ను హెచ్చరిస్తున్నాన్న లోకేశ్... చేసిన తప్పుకి జగన్ మూల్యం చెల్లించక తప్పదన్నారు. నేడు చంద్రబాబును ములాఖత్‌లో లోకేశ్, భువనేశ్వరీ, బ్రాహ్మణి కలవనున్నారు.