LOKESH: ఏఐతో ఉద్యోగాలు పోవు: లోకేశ్
మన మిత్ర వేదిక ద్వారా మెరుగైన సేవలు అందిస్తామన్న లోకేశ్;
విజయవాడలో జరుగుతున్న ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్–2025లో ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఏఐ టెక్నాలజీని అనుసరిస్తూ హ్యాకథాన్లు నిర్వహిస్తోంది అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం కొందరిలో ఉంది. కానీ, పారిశ్రామిక విప్లవం తరువాత ఉద్యోగాలు ఎలా పెరిగాయో మనం చూశామన్నారు. మన మిత్ర ప్లాట్‌ఫారమ్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందిస్తోందన్నారు.
జనవరిలో ఆవిష్కృతం
దక్షిణాసియాలో తొలి 152 బిట్ క్వాంటమ్ కంప్యూటర్ ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటయ్యే వ్యాలీలో జనవరిలో ఆవిష్కృతం కాబోతోందని, ఇది మొత్తం ఎకో సిస్టమ్‌ను మార్చబోతోందని తెలిపారు. విశాఖపట్నం డేటా సిటీగా అభివృద్ధి చెందుతుందన్నారు. పలు ప్రఖ్యాత సంస్థలు విశాఖలో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ముందుకు వస్తున్నాయని వివరించారు. అంతర్జాతీయ మార్పులకు అనుగుణంగా పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ విద్యలో ఏఐ స్కిల్ డెవల్‌పమెంట్ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెడుతున్నామన్నారు. పరిపాలనలోనూ ఏఐ వినియోగం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలందించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని తెలిపారు. ఏఐతో ఉద్యోగాలు కోల్పోరని, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త ఉద్యోగాలు సృష్టిస్తుందని చెప్పారు.