LOKESH: మరో ఉపాధ్యాయుడిపై లోకేశ్ ప్రశంసలు
షేక్ ఫిరోజ్ భాషా అంకితభావంపై లోకేశ్ పొగడ్తలు
పిడుగురాళ్ల మండలం తుమ్మలచెరువు మెయిన్ పాఠశాలలో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా పనిచేస్తున్న షేక్ ఫిరోజ్ భాషాపై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. పిల్లల తలరాతను మార్చే విద్యను అందిస్తూ, అందమైన అక్షరాలు పొందికగా రాయడం నేర్పిస్తున్న షేక్ ఫిరోజ్ భాషా ప్రభుత్వ పాఠశాలలకు ఆదర్శంగా నిలుస్తున్నారని శనివారం మంత్రి లోకేశ్ ట్వీట్ చేశారు. అదనపు సమయం స్కూలులో గడుపుతూ విద్యార్థులకు క్లాసులు తీసుకునే భాషా కమిట్మెంట్కి హ్యాట్సాఫ్ అన్నారు.
'అనంతపురం నేలకు జీవితాంతం రుణపడి ఉంటా'
తమ జీవితాంతం అనంతపురం జిల్లా నేలకు రుణపడి ఉంటామని ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. భక్త కనకదాస జయంతిని పురస్కరించుకుని అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో ఆయన కాంస్య విగ్రహాన్ని మంత్రి లోకేశ్ ముఖ్య అతిథిగా హాజరై ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... భక్త కనకదాస జీవితం అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. సామాజిక తత్వవేత్తగా, స్వరకర్తగా ఆయన సమాజ చైతన్యానికి ఎంతో కృషి చేశారని కొనియాడారు. తన కీర్తనలు, రచనలతో ఆధ్యాత్మిక విలువలు పెంపొందించారని తెలిపారు. అనంతపురం నేల తెలుగుదేశం పార్టీకి ఎప్పుడూ అండగా నిలిచిందని, నందమూరి బాలకృష్ణను మూడు సార్లు గెలిపించి అసెంబ్లీకి పంపిన గొప్ప నేల ఇదని మంత్రి కొనియాడారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో చీకటి రాజ్యం చూసినట్లు పేర్కొన్నారు. ఏపీ ప్రజల కోసం చేయాల్సిన అన్ని పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటూ వస్తున్నట్లు వివరించారు. ఆదరణ పథకం కింద కురబలకు పనిముట్లు అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.
కుప్పంలో 7 పరిశ్రమలకు సీఎం శంకుస్థాపన!
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం పారిశ్రామిక అభివృద్ధిలో కీలక ముందడుగు వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శనివారం ఉండవల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో ఒకేసారి 7 పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 2,203 కోట్ల భారీ పెట్టుబడితో ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేయనున్న ఈ పరిశ్రమలకు ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు స్థానిక ప్రజలు, వివిధ సంస్థల ప్రతినిధులతో ఆన్లైన్లో మాట్లాడారు. ఈ పరిశ్రమలు నిర్దేశించిన సమయానికి ప్రారంభమై, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా కృషి చేయాలని సూచించారు.