KALKI: ‘కల్కి’పై అనంత్ శ్రీరామ్ సంచలన వ్యాఖ్యలు
పురాణాలను వక్రీకరిస్తున్నారన్న గేయ రచయిత... హైందవాన్ని వక్రీకరిస్తున్నారని ఆవేదన;
ప్రముఖ తెలుగు సినిమా పాటల రచయిత అనంత శ్రీరామ్. ఆయన గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఆయన తన పాటలల్లో తెలుగుదనం ఉట్టిపడేలా.. సాహిత్య విలువలను మేళవిస్తూ పాటలను రాస్తారు. ఆయన పాటలల్లో తెలుగు భాష ఔన్నత్యం, గొప్పదనం కనిపిస్తుంది. తాజాగా అనంత శ్రీరామ్ తెలుగు సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ సాహిత్యానికి రెండు కళ్లైయిన రామాయణం, మహాభారతంపై నిత్యం దాడి జరుగుతోందని గేయ రచయిత అనంత్ శ్రీరామ్ సంచలన కామెంట్స్ చేశారు. సినిమాల్లో వినోదం కోసం మన పురాణాలను వక్రీకరిస్తున్నారన్నారు. భారత సినీ పరిశ్రమ మొదలైనప్పటి నుంచి తాజాగా కల్కి సినిమా వరకు అదే జరిగిందన్నారు. క్యారెక్టర్ల వక్రీకరణ చూసి సిగ్గుపడుతున్నానన్నారు. అయితే, పొరపాటును పొరపాటని చెప్పకపోతే హైందవ ధర్మంలో పుట్టినట్లే కాదన్నారు.
హైందవ దర్మాన్ని వక్రీకరిస్తున్నారు
విజయవాడలో జరిగిన హైందవ శంఖారావం సభలో టాలీవుడ్ పాటల రచయిత అనంత శ్రీరామ్ పాల్గొన్నారు. తెలుగు సినిమాల్లో హైందవ ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని అన్నారు. సినిమాలు వ్యాపారమే అయినప్పటికీ హిందూ ధర్మాన్ని కించపరచడం సరికాదని, వ్యాపారం కోసం హిందుధర్మ వక్రీకరణకు పాల్పడుతున్నందుకు ఓ సినిమా వ్యక్తిగా తాను సిగ్గు పడుతున్నననీ, చిత్రపరిశ్రమ తరపున నేను క్షమాపణలు చెబుతున్ననని అనంత శ్రీరామ్ సంచలన ప్రకటన చేశారు.
మూడో కోణాల్లో దాడి
సినిమాల్లో హైందవ ధర్మంపై మూడుకోణాల్లో జరుగుతోందని ఆరోపించారు అనంత శ్రీరామ్. ' అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలను వక్రీకరించడం, రెండవది .. తెర మీద కనిపించే పాత్రల్లో.. వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం, మూడవది తెరవెనక, మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన. ' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.