విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గేట్ వద్ద వైద్య విద్యార్ధుల నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. పర్మినెంట్ రిజిస్ట్రేషన్ కోరుతూ సోమవారం నుంచి యూనివర్శిటీ ఎదుట కొనసాగుతున్న వైద్య విద్యార్ధులు రెండో రోజు కూడా నిరాహారదీక్ష కొనసాగించారు. దీక్షలు చేస్తున్న విద్యార్ధులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేసి మాచవరం, గుణదల, పటమట పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు తమ పట్ల అమర్యాదగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయ పోరాటం చేస్తున్న తమ గొంతు నొక్కాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తామేమీ సంఘ విద్రోహ శక్తులం కాదని, ప్రజలకు సేవ చేయడం కోసం రాష్ట్రంలో సీట్ దక్కక కష్టపడి విదేశాల్లో వైద్య విద్య చదివామన్నారు.