శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో డయేరియా కలకలం రేపుతోంది. గత 24 గంటల్లో 19 మంది అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చేరారు. కలుషిత నీరే కారణమని భావిస్తున్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ బాధితులను పరామర్శించారు. ప్రజలు నీటిని మరిగించి తాగాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుతం బాధితుల పరిస్థితి నిలకడగా ఉంది. ఇటు, మంత్రి నారాయణ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.
రాజమహేంద్రవరం ఘటన.. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు
రాజమహేంద్రవరంలోని చౌడేశ్వరి నగర్, స్వరూప్ నగర్లో స్థానికులు అస్వస్థతకు గురైన ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేశారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. లాలాచెరువు ప్రాంతంలో నలుగురు చనిపోయారని.. ఎనిమిది మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని చెప్పారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామన్నారు. వరలక్ష్మి డెయిరీకి చెందిన కల్తీ పాల వల్లే పలువురు అస్వస్థతకు గురైనట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిందని పేర్కొన్నారు. సెక్షన్ 194 కింద బాధ్యులపై కేసు నమోదు చేశామన్నారు. సామాజిక సమానత్వం అనే లక్ష్యం కోసం ఎన్డీయే కూటమి ప్రభుత్వం పని చేస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. సంక్షేమ బడ్జెట్ కేటాయింపులపై ఆయన మాట్లాడుతూ.. రాజకీయంగా కూడా వెనుకబడిన వర్గాలకు ప్రాధాన్యం కల్పించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
చౌడేశ్వరినగర్లో ఇంటింటా సర్వే
రాజమహేంద్రవరంలోని లాలాపేట చెరువు చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. జిల్లా అధికారులు మీడియా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వం తరఫున చేపట్టిన చర్యలను వివరించారు. కల్తీ పాలతో అస్వస్థతకు గురైనట్లు ఆరోపణలు వచ్చినందున పూర్తిస్థాయిలో విచారణ చేపట్టినట్లు తెలిపారు. పాలు పోసిన వ్యాపారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. ఈ ఘటనపై సమీక్ష నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ చెప్పారు.