TTD: తిరుమలలో ఇక "స్వర్ణ" నిబంధనలు..!
తిరుమల శ్రీవారి దర్శనంపై కఠిన నిబంధనలు
తిరుమల శ్రీవారి పవిత్రతను కాపాడేందుకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దర్శనానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు డిక్లరేషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని టీటీడీకి ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి ఎవరైనా అన్యమతస్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే తప్పనిసరిగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని పేర్కొంది. ఇప్పటివరకు ఈ నిబంధన ఉన్నా అంతగా అమలు కావడం లేదు. స్వచ్చంధంగా కొంతమంది డిక్లరేషన్ ఇచ్చేందుకు ముందుకొస్తున్నాయి. కొంతమంది డిక్లరేషన్ ఇవ్వకుండానే దర్శించుకుంటున్నారు. ఇక నుంచి ఈ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తిరుమల ఆలయం పవిత్రతను రక్షించేందుకు ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. స్వర్ణ దేవాలయం చట్టాన్ని అధ్యయనం చేయాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. స్వర్ణ దేవాలయం తరహాలోనే తిరుమలలోనూ కొత్త చట్టాన్ని తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ చట్టం అమలు చేయడం వల్ల తప్పు చేసినవారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అవకాశముంటుంది.
పాముకాటు ప్రచారం.. అంతా అవాస్తవం
తిరుమల క్యూలైన్లో ఓ భక్తురాలు పాముకాటుకు గురైనట్లు జరుగుతున్న ప్రచారాన్ని టీటీడీ ఖండించింది. ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తేల్చి చెప్పింది. ఈ మేరకు వాస్తవంగా అక్కడేం జరిగిందో వివరిస్తూ ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్‌చెక్ విభాగం సైతం ‘ఎక్స్’లో పోస్టు పెట్టింది. ‘‘తిరుమల క్యూలైన్లో భక్తురాలు పాముకాటుకు గురైనట్లు కొందరు చేస్తున్న ప్రచారంలో నిజం లేదు. వాస్తవానికి జరిగింది ఏమిటంటే.. వరంగల్‌కు చెందిన శరత్ బాబు, మౌనిక దంపతులు ఆదివారం రాత్రి స్వామి దర్శనం కోసం టాక్సీలో ఎస్వీ మ్యూజియం వద్దకు వచ్చారు. ఆర్.బి.సెంటర్ పార్కింగ్ ఏరియా వద్దకు రాగానే తన కాలికి పసుపు రాసుకునే ఉద్దేశంతో మౌనిక కారు నుంచి కిందకు దిగారు. ఆ సమయంలో తన కాలికి ఏదో తాకడంతో ఆమె భయంతో గట్టిగా అరిచారు. వెంటనే ఆమె భర్త శరత్ బాబు వెతికి చూడగా అక్కడ ఒక పాము పిల్ల కనిపించింది. దీంతో అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మౌనికను తిరుమలలోని అశ్విని ఆస్పత్రికి తీసుకువెళ్లారు. భక్తురాలిని పరీక్షించిన వైద్యులు ఆమె పాముకాటుకు గురికాలేదని నిర్ధారించారు. అయినప్పటికీ ఆమె శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని ముందు జాగ్రత్తగా తిరుపతిలోని స్విమ్స్‌లో చేర్చారు. స్విమ్స్ వైద్యులు సైతం ఆమె పాము కాటుకు గురికాలేదని చెప్పారు. అలాగే, అక్కడ కనిపించిన పాము కూడా విషపూరితం కాదని తేలింది. ఈ ఘటన జరిగిన వెంటనే తితిదే సిబ్బంది స్పందించిన తీరుకు ఆ దంపతులు కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఉదయం ఆ దంపతులు స్వామిని దర్శించుకున్నారు. జరిగింది ఇదీ. అందువల్ల కొందరు చేస్తున్న ఫేక్ ప్రచారాలను భక్తులు నమ్మొద్దు’’ అని విజ్ఞప్తి చేసింది.