MUNTHA CYCLONE: రైతన్నను నిండా ముంచేసిన "మొంథా"
ఏపీలో వేల ఎకరాల్లో వరి పంట నాశనం.. నీట మునిగిన కంకుల దశకు వచ్చిన పంట.. పత్తి, వరి, మిర్చి తోటలకు తీవ్ర నష్టం.. వందల ఎకరాల్లో అరటి తోటలు ధ్వంసం
‘మొంథా’ తుఫాన్ వరి రైతులను నిండా ముంచేసింది. భారీ వర్షాలకు ఈదురుగాలు తోడవడంతో పంటనష్టం మరింత పెరిగింది. బాపట్ల, వేమూరు, రేపల్లె, తెనాలి ప్రాంతాలలో వేల ఎకరాలలో వరి నేలవాలిపోయింది. కంకుల దశకు వచ్చిన వరి పంట పూర్తిగా నేలకొరిగింది. ఏకధాటిగా కురిసిన వర్షంతో రైతులు ఆశ వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందే పంట నాశనం అవుతుండడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుతున్నారు.
రైతన్నకు భారీ నష్టం
తుఫాన్ ప్రభావంతో ఏపీలోని దాదాపు అన్న జిల్లాల్లో వరి పంటలకు అపార నష్టం వాటిల్లింది. చేతికి అంది వచ్చిన సమయంలో వరి పంట నేలకొరిగింది. ఆరుగాలం కష్టించి పండించిన వరి పంటలు నేలపాలు కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరానికి 30 వేల నుండి 40 వేల రూపాయల వరకు నష్టం వాటినట్టు వాపోతున్నారు. ఎకరానికి 40 బస్తాలు వచ్చే దిగుబడి ఇప్పుడు 10 నుండి 20 బస్తాలు మాత్రమే వచ్చే పరిస్థితి నెలకొందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. తుపాను ప్రభావంతో విజయనగరం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలోని గుర్ల మండలం కెల్లా ఆర్ఓబీ వద్ద వర్షపు నీరు చేరడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. జామి మండల కేంద్రంలో వందల ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. వేపాడ మండలంలోని బొద్దాం గ్రామంలో ఊర చెరువు గర్భంలో ఉన్న చెట్టుబలిజలను పునరావాస కేంద్రానికి వెళ్లాల్సిందిగా ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి సూచించారు. పోతనాపల్లి వద్ద పంట పొలాలు మునిగిపోయి వర్షపు నీరు రోడ్డు మీదుకు చేరుతోంది. తెలంగాణలోనూ అనేక గ్రామాలలో వానాకాలం సాగు చేపట్టిన పత్తి, వరి పంట ఇటీవల వేసిన మిర్చి తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఇప్పటికే వరుస వర్షాలతో పత్తి చేలు ఊటబట్టి పోగా దిగుబడి పూర్తిగా తగ్గింది. ఈ తరుణంలో చేతికి వచ్చిన పంటను తీసే క్రమంలో తుఫాన్ ప్రభావంతో భారీ వర్షాలు వాన ముసురు కురుస్తుండటంతో పండిన పంట సైతం చేతికి వచ్చే అవకాశం లేకుండా పోయింది.
ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పశ్చిమ ప్రాంతంలో పంట నష్టం ఎక్కువగా ఉంది. కాపుకొచ్చిన సజ్జ పంట 1,771 హెక్టార్లలో దెబ్బతింది. జొన్న 60 హెక్టార్లు, మొక్కజొన్న 268 హెక్టార్లు, పత్తి 6,577 హెక్టార్లు, వరి 1,440 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. నాగులుప్పలపాడు, జరుగుమల్లి, కొండపి ప్రాంతాల్లో పొగాకు నారుమళ్లు దెబ్బతిన్నాయి.