Viveka Murder Case: అవినాష్‌పై హత్యానేరం
భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిలూ కుట్రలో భాగమే! రాజకీయ వైరుధ్యాలతోనే కుట్ర...;
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్‌పై హత్యానేరం మోపింది సీబీఐ.కుట్ర పన్నడమేకాక, హత్యానంతరం సాక్ష్యాలను ధ్వంసం కూడా చేశారంటూ అవినాష్‌రెడ్డిపై సీబీఐ ఛార్జ్‌షీట్‌లో తెలిపింది. అవినాష్‌రెడ్డితోపాటు వైఎస్ భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డి కూడా హత్యకుట్రలో భాగస్వాములయ్యారని పేర్కొంది. వివేకాతో అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డిలకు రాజకీయ విభేదాలు ఉండటంతో కుట్రకు తెర తీశారని తెలిపింది. వివేకానందరెడ్డి పీఏ ఎం.వి.కృష్ణారెడ్డి, పనిమనిషి కుమారుడు వై.ప్రకాష్, వైఎస్ మనోహర్‌రెడ్డిలపై ఆరోపణలున్నా.. ప్రాసిక్యూషన్‌కు ఆధారాల్లేవని పేర్కొంది. అంతేగాకుండా ఆస్తి వివాదాల్లో భాగంగా వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీతారెడ్డి, అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి, అల్లుడి సోదరుడు శివప్రకాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని క్లారిటి ఇచ్చింది.
వివేకా ఇంటిలో ఏర్పాటు చేసిన వై-ఫై రూటర్ నుంచి కొంతమంది ఐఎంఓ వినియోగదారులు ఉన్నారని, వీరి సమాచారం తెలుసుకోవడానికి కేంద్రం ద్వారా అమెరికా అధికారులకు పంపినట్లు తెలిపింది. అమెరికా అధికారులు అడిగిన సమాచారాన్ని గత నెల కూడా పంపామంది. వివేకాతో బలవంతంగా రాయించిన లేఖను నిన్‌హైడ్రిన్ పరీక్ష కోసం సీఎఫ్‌ఎస్‌ఎల్‌కు, దర్యాప్తులో భాగంగా స్వాధీనం చేసుకున్న కొన్ని ఫోన్లను ఫోరెన్సిక్ పరీక్ష కోసం త్రివేండ్రంలోని సీడాక్‌కు పంపామని వెల్లడించింది. ఆయా ప్రాంతాల నుంచి సమాచారం అందిన వెంటనే కోర్టుకు సమర్పిస్తామని చెప్పింది. సంఘటనా స్థలంలో సాక్ష్యాలను ధ్వంసం చేయడంలో గంగిరెడ్డితో పాటు ఉదయ్‌కుమార్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, భాస్కరరెడ్డి, శివశంకర్‌రెడ్డి కీలకపాత్ర పోషించారని తెలిపింది. వివేకా భార్య, కుమార్తె రాకముందే రక్తపు మరకలను తుడిచి గుండెపోటుతో మరణించినట్లు తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారంది. వైఎస్ భాస్కరరెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డి, గజ్జల ఉదయ్‌కుమార్‌రెడ్డిల పాత్రపై దర్యాప్తు చేసిన సీబీఐ 2వ అనుబంధ అభియోగపత్రాన్ని ఇటీవల సీబీఐ కోర్టుకు సమర్పించింది.
మరోవైపు గూగుల్ టేక్‌ఔట్ ప్రకారం సునీల్‌యాదవ్ మార్చి 15న తెల్లవారుజామున 2.42 సమయంలో వివేకా ఇంటిలో ఉన్నారు. 2.34కు వివేకా సమీపంలో ఉన్నారు.గ్రీన్‌విచ్ కాలమానం కంటే భారత కాలమానం 5.30 గంటలు ముందు ఉంటుందని సీబీఐ తెలిపింది.మార్చి 14,15 తేదీల్లో అందుబాటులోని నిందితుల ఐపీడీఆర్‌ను పరిశీలిస్తే గంగిరెడ్డి, అవినాష్‌రెడ్డి మధ్య వాట్సప్ సందేశాలు జరిగినట్లు తేలింది. ఇద్దరి వాట్సప్ ఖాతాలు ఒకే సమయంలో యాక్టివ్‌గా ఉన్నాయి. తెల్లవారుజామున 1.37 నుంచి ఉదయం 5.18 దాకా వారిద్దరి నంబర్ల నుంచి పలు వాట్సప్ సందేశాలు అటు ఇటూ వెళ్లాయి. అయితే వాట్సప్ డేటా మాత్రం దొరకలేదని సీబీఐ తెలిపింది.
ఇక మార్చి 15న జమ్మలమడుగులో ఏర్పాటైన రాజకీయ కార్యక్రమానికి వెళుతూ.. వివేకా చనిపోయారని ఫోన్ సమాచారంతో వెనక్కి తిరిగి వచ్చానని అవినాష్‌రెడ్డి చెప్పడం అవాస్తవమని సీబీఐ తెలిపింది. ఇక వివేకా తన రెండో భార్య షమీమ్ నంబరును ఫోన్‌లో సాంబశివారెడ్డి అనే పేరుతో పెట్టుకున్నారు. ఈ నంబరు నుంచి మార్చి 15న తెల్లవారుజామున 1.31కు మెసేజ్ వచ్చేసరికి హత్య జరగలేదు. 4.32కు మిస్డ్ కాల్ ఉంది. మార్చి 8 నుంచి 15 వరకు షమీమ్ నుంచి ఫోన్ మెసేజ్‌లు వచ్చాయి.