CBN: 2027 జూన్‌లోపే పోలవరం పూర్తి చేస్తాం

లా అండ్ ఆర్డర్ కు ఎవరైనా భంగం కలిగిస్తే తాట తీస్తానని చంద్రబాబు హెచ్చరిక

Update: 2026-02-06 12:00 GMT

కరవు ఛాయలతో బాధపడుతున్న రాయలసీమ ప్రాంతానికి శాశ్వత పరిష్కారం చూపే దిశగా రాష్ట్ర ప్రభుత్వం దృఢమైన చర్యలు తీసుకుంటోందని ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. వేదావతి ప్రాజెక్టు పూర్తయితే హంద్రీ–నీవా కాలువ ద్వారా కరవు ప్రాంతాలకు సమృద్ధిగా నీరు అందుతుందని, ఆ లక్ష్య సాధన కోసం ప్రభుత్వం అన్ని విధాల కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. తుంగభద్ర నది నుంచి వచ్చే నీటిని కర్నూలు జిల్లా పూర్తిగా వినియోగించుకోగలిగితే, జిల్లాలో ఇక నీటి కొరతే ఉండదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం కలుగొట్ల గ్రామంలో నిర్వహించిన ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తొలుత అక్కడ ఏర్పాటు చేసిన వివిధ శాఖల స్టాళ్లను పరిశీలించిన ఆయన, అనంతరం రైతులకు రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలను అందజేశారు. రైతుల హక్కులను పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని, అందుకే అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్టును రద్దు చేశామని తెలిపారు.

ఆధునిక సాంకేతిక వినియోగిస్తాం

భూములపై రైతులకు పూర్తి భద్రత కల్పించేందుకు ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నామని సీఎం చెప్పారు. ఇకపై క్యూఆర్ కోడ్ ద్వారా భూమికి సంబంధించిన అన్ని వివరాలను రైతులు స్వయంగా తెలుసుకోవచ్చని, ఎవరైనా అక్రమంగా భూమిని ఇతరుల పేరుపైకి మార్చే ప్రయత్నం చేస్తే వెంటనే సమాచారం అందుతుందని వివరించారు. పట్టాదారు పాసుపుస్తకాల రికార్డులన్నీ కంప్యూటర్‌లో భద్రంగా నిల్వ ఉంటాయని, వాటిని ట్యాంపర్ చేయడం అసాధ్యమని తెలిపారు. ఒకవేళ ఎవరైనా అటువంటి ప్రయత్నం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అవసరమైతే పీడీ యాక్ట్‌ను కూడా ప్రయోగించి శిక్షిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల భూమి పుస్తకాలపై అప్పటి పాలకుల ఫొటోలు ముద్రించడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ఇది శాడిజానికి పరాకాష్ట అని విమర్శించారు. వారసత్వంగా వచ్చిన భూములపై గత సీఎం, ఆయన కుటుంబ సభ్యుల ఫొటోలు పెట్టుకునే హక్కు ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. స్కూల్‌కి వెళ్లినా, పొలానికి వెళ్లినా అదే ఫొటోలు కనిపించేవని, ఇది ప్రజలపై రుద్దిన మానసిక దౌర్జన్యమని వ్యాఖ్యానించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని సీఎం తెలిపారు. గతంలో భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులు ఇబ్బడిముబ్బడిగా వచ్చాయని, వాటిని శాశ్వతంగా పరిష్కరించేందుకే ‘మీ భూమి – మీ హక్కు’ కార్యక్రమాన్ని ప్రారంభించామని చెప్పారు. ఇకపై పట్టాదారు పాసుపుస్తకాలలో ఏ మార్పులైనా రైతుల స్పష్టమైన అనుమతితోనే జరుగుతాయని, లంచాల వ్యవస్థకు పూర్తిగా స్వస్తి చెప్పేందుకే ఈ విధానాన్ని అమలు చేస్తున్నామని వివరించారు. భూ సమస్యల పరిష్కారానికి ప్రతి నెలా 9వ తేదీన జిల్లాలకు వచ్చి సమీక్షలు నిర్వహిస్తానని హామీ ఇచ్చారు.

వైసీపీపై తీవ్ర విమర్శలు

గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపేసిందని తీవ్ర విమర్శలు చేశారు. అయితే తమ ప్రభుత్వం గోదావరి పుష్కరాల లోపే, అంటే 2027 జూన్ నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి జాతికి అంకితం చేస్తుందని స్పష్టం చేశారు. అలాగే నందుల అనుసంధానం పూర్తి చేసి రాయలసీమకు నీళ్లు తీసుకొస్తామని, అప్పుడే ఈ ప్రాంతం నిజమైన అర్థంలో ‘రత్నాల సీమ’గా మారుతుందని అన్నారు. పారిశ్రామిక అభివృద్ధిపై కూడా సీఎం కీలక ప్రకటన చేశారు. మూడేళ్లలో కడప జిల్లాలో స్టీల్ ప్లాంట్ పనులను పూర్తిచేస్తామని, దీనివల్ల ప్రాంతీయ యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించబడతాయని చెప్పారు. అభివృద్ధితో పాటు క్రమశిక్షణ కూడా అవసరమని పేర్కొన్న ఆయన, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్‌కు ఎవరైనా భంగం కలిగిస్తే కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు. శాంతిభద్రతలను కాపాడటంలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని స్పష్టం చేశారు. మొత్తంగా రైతుల భూమి హక్కుల పరిరక్షణ, కరవు నివారణ, నీటి వనరుల అభివృద్ధి, పరిశ్రమల స్థాపనతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ—ఈ నాలుగు అంశాలే ప్రభుత్వ పాలనకు పునాదులని ముఖ్యమంత్రి తన ప్రసంగంలో స్పష్టంగా పేర్కొన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News