NADDA: అవినీతి, ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని కూలదోశాం
సారథ్యం సభలో పాల్గొన్న బీజేపీ జాతీయ చీఫ్.. మోదీ, చంద్రబాబు పాలనలో అభివృద్ధి : నడ్డా.. వారసత్వ రాజకీయాలకు చెల్లు చీటి రాశాం
ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రగతి పథంలో నడుస్తోందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ చేపట్టిన ‘సారథ్యం’ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వం.. అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు అవలంబించిందని విమర్శించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంలో మగ్గిందని విమర్శించారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన 15 నెలల్లోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమని నిరూపించామన్నారు. ప్రజల అంకితభావం వల్లే ఈ మార్పు సాధ్యమైందని చెప్పారు. ‘‘ప్రస్తుతం సబ్ కా సాథ్, సబ్ కా వికాస్, సబ్ కా విశ్వాస్’ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. అయోధ్యలో రామ మందిరం నిర్మించాం. ట్రిపుల్ తలాక్‌ను రద్దు చేశాం. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడం కోసం జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు ముందుగానే దసరా, దీపావళి తీసుకొచ్చాం. " అని వివరించారు.
వైసీపీపై జేపీ నడ్డా తీవ్ర విమర్శలు
“ 2014కు ముందు దేశంలో అసమర్థ, వారసత్వ రాజకీయాలు నడిచేవి. అప్పట్లో దేశంలో అవినీతి రాజ్యమేలింది. 2014కు ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు మేనిఫెస్టో తీసుకొచ్చి ఎన్నికలయ్యాక మరిచిపోయేవారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అంధకారంలోకి వెళ్లిపోయింది. ఆ పార్టీ అవినీతి పాలనకు చంద్రబాబు, మోదీ చరమగీతం పాడారు. ఇప్పుడు మోదీ పాలనలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. ఇదే స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి. ఆంధ్ర ప్రజల గుండెల్లో మోదీ ఉన్నారు. ఆయన గుండెల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. సైద్ధాంతిక పునాదులపై నిర్మాణమైన పార్టీ బీజేపీ’ అని జేపీ నడ్డా అన్నారు. విశాఖ, కాకినాడ, తిరుపతి స్మార్ట్ సిటీలుగా నిలుస్తున్నాయని.. సాగర్మాల పేరుతో 14 పోర్టులు నిర్మిస్తున్నాని నడ్డా వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేసిన నడ్డా, రాష్ట్రానికి కేటాయించిన పలు కీలక ప్రాజెక్టులను ప్రస్తావించారు. సాగర్ మాల పథకం కింద 14 పోర్టుల నిర్మాణం, విశాఖపట్నం, కాకినాడ, తిరుపతిలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం, జాతీయ రహదారుల విస్తరణ వంటి మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం పెద్దపీట వేస్తోందన్నారు. విద్య, ఆరోగ్య రంగాల్లో 10 కేంద్ర విద్యాసంస్థలు, 6 కొత్త వైద్య కళాశాలలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.