MLC: ఎమ్మెల్సీగా నాగబాబు ప్రమాణస్వీకారం
సోము వీర్రాజు కూడా ప్రమాణం.. పవన్‌తో నాగబాబు భేటీ;
ఎమ్మెల్సీగా కొణిదెల నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. ఎమ్మెల్యే విభాగంలో శాసన మండలికి ఏకగ్రీవంగా ఎన్నికైన నాగబాబుతో మండలి చైర్మన్ మోషేన్ రాజు ప్రమాణ స్వీకారం చేయించారు. అలాగే, బీజేపీ నుంచి సీనియర్ నేత సోము వీర్రాజు కూడా ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇరువురికి పలువురు ఎమ్మెల్యేలు, నాయకులు అభినందనలు తెలిపారు. తనకు రెండోసారి ఎమ్మెల్సీగా అవకాశం రావడం పట్ల సోము వీర్రాజు సంతోషం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్సీ నాగబాబు ఆస్తుల వివరాలు ఇవే!
మెగా బ్రదర్ నాగబాబు ఆస్తులు, అప్పులకు సంబంధించి ఓ న్యూస్ బయటకు వచ్చింది. చరాస్తుల విలువ సుమారు రూ.59 కోట్లు ఉన్నాయి. చేతిలో నగదు రూ.21.81 లక్షలు, బ్యాంకు నిల్వలు రూ.23.53 లక్షలు, ఇతరులకు ఇచ్చిన అప్పులు రూ.1.03 కోట్లు ఉన్నాయి. బెంజ్, హ్యుందాయ్ కార్లు ఉన్నట్లు వెల్లడించారు. చిరంజీవి దగ్గర రూ.28.48 లక్షలు, పవన్ దగ్గర రూ.6.90 లక్షలు అప్పులు ఉన్నాయి. నాగబాబు ఎమ్మెల్సీగా నామినేషన్ దాఖలు చేసిన సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్‌లో ఈ వివరాలు వెల్లడించారు.
నాగబాబుకు చిరంజీవి అభినందనలు
MLCగా కొణిదెల నాగబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు నాగబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ‘ఏపీ విధాన పరిషత్ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన తమ్ముడు నాగబాబుకి ఆత్మీయ అభినందనలు, ఆశీస్సులతో - అన్నయ్య, వదిన’ అంటూ ట్వీట్ చేశారు. గతంలో నాగబాబును సన్మానించిన ఫొటోను ఎక్స్‌లో షేర్ చేశారు.
నాగబాబు కు ఎమ్మెల్యే ఆరణి అభినందనలు
ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన కొణిదల నాగబాబుకు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అభినందనలు తెలిపారు. బుధవారం ఉదయం అసెంబ్లీ కమిటీ హాలులో ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేసిన ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి, జనసేన ప్రధాన కార్యదర్శి గాను వ్యవహరిస్తున్న నాగబాబు మరెన్నో ఉన్నత పదవులు అలంకరించాలని ఆరణి శ్రీనివాసులు ఆకాంక్షించారు.