దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి రాజీనామా

Update: 2020-10-01 07:32 GMT

దుర్గగుడి పాలకమండలి సభ్యురాలు నాగవరలక్ష్మి రాజీనామా చేశారు. నిన్న దుర్గగుడి ట్రస్ట్‌బోర్డు సభ్యురాలి కారులో మద్యం అక్రమ రవాణా బయటపడింది. జగ్గయ్యపేటలో వాహనాన్ని పట్టుకున్నారు. ఈ విషయాన్ని టీవీ5 వెలుగులోకి తేవడం సంచలనంగా మారింది. పాలకమండలి సభ్యురాలి కారులోనే మద్యం తరలింపుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ కేసులో ఇప్పటికే నాగవరలక్ష్మి భర్తతోపాటు డ్రైవర్‌ను అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ ముగిసే వరకూ నైతిక బాధ్యత వహించి పదవి నుంచి తప్పుకుంటున్నట్టు వరలక్ష్మి ఆలయ ఈవోకు, పాలకమండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. తనకు కానీ, తన కుటుంబ సభ్యులకు కానీ ఈ మద్యం రవాణాతో సంబంధం లేదని ఆమె అంటున్నారు.

నాగవరలక్ష్మి రాజీనామాను ఆమోదించినట్లు దుర్గగుడి ఛైర్మన్‌ తెలిపారు. ఇందులో ఆమె పాత్ర లేకపోయినా... నైతిక బాధ్యత వహిస్తూ.. ఆమె రాజీనామా చేసినట్లు తెలిపారు. దీనిపై అటు పోలీసులు దర్యాప్తు పాటు, అంతర్గతంగా విచారణ జరుగుతోందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. అయితే... కేవలం రాజీనామా చేస్తే సరిపోదన్నారు జనసేన నేత పోతిన మహేష్. ఈ కేసులో... ఆమె కుటుంబసభ్యుల పాత్ర ఉన్నందున.. ఆమెపైనా కేసు నమోదు చేయాలని డిమాండ్‌ చేశారు. దుర్గగుడికి అప్రతిష్ట తెచ్చే పనులు చేసిందుకు నాగవరలక్ష్మిని అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు.

Similar News