జగన్ అధికారంలోకి రావడానికి అనేక అసత్య ప్రచారాలు చేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆరోపించారు. తనపై అబద్దాలు ప్రచారం చేసిన వైసీపీ నేతలను, తప్పుడు రాతలు రాసినవారిని వదలబోనన్నారు. పరువునష్టం దావా వేయడంతో వైసీపీ నేతలు, వారి మీడియా తోకముడుచుకొని పారిపోయే పరిస్థితి ఏర్పడిందన్నారు. చట్టాలు ఉల్లంఘించిన అధికారులపై అధికారంలోకి రాగానే తప్పక చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యాయం జరిగే వరకు వెనుకడుగు వేసే ప్రసక్తే లేదన్నారు.
రాజధాని అమరావతిలో ఇళ్ళ స్థలాల పేరుతో జగన్ మరోసారి పేదలను మోసం చేశారని లోకేష్ ఆరోపించారు. దాని ఫలితమే కోర్టు తీర్పు అలా వచ్చిందన్నారు. కరకట్ట కమలహాసన్, ముఖ్యమంత్రి ఒకరిని మించి మరొకరు మహానటులు అని ఎద్దేవాచేశారు. సిఆర్డీఏ చట్టంలో పేదలకు 3 శాతం భూములు ఇవ్వచ్చన్న సంగతి వైసీపీ నేతకు తెలియదా అని ప్రశ్నించారు. వైసీపీ సర్కార్ కావాలని నాటకాలాడుతోందని మండిపడ్డారు. వైసీపీ నేతలు పేదలను మోసం చేస్తోన్న దోపిడిదారులంటూ ధ్వజమెత్తారు.