రమ్య తల్లిదండ్రులను పరామర్శించిన నారా లోకేశ్
Nara Lokesh: బాధిత కుటుంబానికి టీడీపీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.;
Nara Lokesh: రమ్య తల్లిదండ్రులను పరామర్శించారు నారా లోకేశ్. బాధిత కుటుంబానికి టీడీపీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు. కాసేపట్లో జరగబోయే రమ్య అంత్యక్రియల్లోనూ నారా లోకేశ్ పాల్గొంటారు. రమ్య హత్య వార్త తెలిసిన తరువాత.. కుటుంబ సభ్యులకు నిన్ననే ఫోన్ చేసి పరామర్శించారు నారా లోకేశ్. బాధిత కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు, నిందితుడికి కఠిన శిక్ష పడేంత వరకు టీడీపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
రమ్య కుటుంబానికి న్యాయం జరగాలంటూ పోరాడుతున్న టీడీపీ శ్రేణులపై ఎదురుదాడికి దిగారు వైసీపీ కార్యకర్తలు. గుంటూరు జీజీహెచ్ ముందు టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణ తలెత్తింది. హాస్పిటల్‌కి వచ్చి వెళ్తున్న ధూళిపాళ్ల నరేంద్ర కారుపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. దీంతో టీడీపీ నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, శ్రవణ్‌కుమార్, మల్లిబాబు, వందనాదేవి కారు నుంచి దిగి ఆందోళన చేపట్టారు.
గుంటూరు జీజీహెచ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపించాయి. నారా లోకేశ్ వస్తున్నారన్న సమాచారం ఉండడంతో.. రమ్య డెడ్‌బాడీని మార్చురీ నుంచి హడావుడిగా తరలించారు పోలీసులు. టీడీపీ శ్రేణులు మార్చురీ వాహనాన్ని అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎలాగైనా డెడ్‌బాడీని అక్కడి నుంచి తరలించాలనే ఉద్దేశంతో.. మార్చురీ వెనక నుంచి తరలించేశారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేశారు టీడీపీ కార్యకర్తలు.
తమ కూతురిని కత్తిపోట్లతో కడతేర్చిన ఉన్మాదిని.. ఎన్‌కౌంటర్ చేయాలంటూ డిమాండ్ చేశారు రమ్య తల్లిదండ్రులు. కోర్టు, జైలు అంటూ జాప్యం చేయవద్దని, సత్వర న్యాయం చేయాలని హోంమంత్రి సుచరితను కోరారు. శశికృష్ణను ఎన్‌కౌంటర్ చేసేంత వరకు తమ బిడ్డ డెడ్‌బాడీని మార్చురీ నుంచి తీసుకెళ్లబోనివ్వమని చెప్పారు. పైగా నారా లోకేశ్ కూడా వస్తుండడంతో.. పోలీసులు ఆగమేఘాల మీద.. మార్చురీ వెనక నుంచి రమ్య డెడ్‌బాడీని తరలించేశారు.