గన్నవరం గడ్డపై వైసీపీ నేతలకు లోకేష్ హెచ్చరికలు
సీఎం జగన్ అన్నం కాదు.. ఇసుక తింటున్నాడు -లోకేష్;
గన్నవరం గడ్డపై వైసీపీ నేతల్ని హెచ్చరించారు టీడీపీ యువనేత నారా లోకేష్. అధికారంలోకి వచ్చాక వడ్డీకి వడ్డీ చెల్లిస్తానన్నారు. ఎంత దూరం వెళ్లినా పట్టుకొచ్చి మరీ బొక్కలో వేస్తానన్నారు. చట్టాన్ని ఉల్లంఘించిన నేతలు, అధికారుల్ని వదలబోనన్నారు. తప్పుడు కేసులు పెట్టిన వారిపై జ్యుడీషియల్ విచారణ చేసి జైలుకు పంపుతానన్నారు లోకేష్.
సీఎం జగన్ రోజూ ఇసుక తిని బతుకుతున్నాడంటూ లోకేష్ ధ్వజమెత్తారు. టీడీపీ హయాంలో ట్రాక్టర్ ఇసుక 1,500 ఉంటే ఇప్పుడు అదే ఇసుక 5వేలు పలుకుతోందన్నారు. ఒక్క ఇసుక ద్వారానే ఈ నాలుగేళ్లలో 5వేల 400కోట్లు దోచుకున్నాడని విరుచుకుపడ్డారు. తాను పాదయాత్ర చేస్తే జగన్‌కు కాలి నొప్పి వచ్చిందంటూ లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ కాలిని పరిశీలించిన డాక్టర్.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చిపోయి మడమతిప్పారని.. అందుకే కాలి నొప్పి వచ్చిందని జగన్‌కు చెప్పాడన్నారు లోకేష్.
సన్నబియ్యం సన్నాసికి గుట్కా, పేకాట క్లబ్బులపై తప్ప ఏమీ అవగాహన లేదన్నారు నారా లోకేష్. తన తల్లిని కొడాలి నాని అసెంబ్లీ సాక్షిగా అవమానించారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక గుడివాడలో సన్నబియ్యం సన్నాసికి తగిన గుణపాఠం చెప్తానన్నారు. వల్లభనేని వంశీ పిల్ల సైకో అంటూ సెటైర్ వేశారు నారా లోకేష్. అలాంటి పిల్ల సైకో దేవాలయం లాంటి ఆఫీసుపై దాడి చేసి తగులబెట్టాడని.. త్వరలో ఆ పిల్ల సైకోకు భయాన్ని పరిచయం చేసి షాక్ ట్రీట్‌మెంట్ ఇచ్చే బాధ్యత తనదేనన్నారు లోకేష్
రాముడి తల నరికితే నవ్వుకున్నవాడికి దేవాదాయ శాఖను అప్పగించారని నిప్పులు చెరిగారు నారా లోకేష్. అతడు కొబ్బరి చిప్పలను దొంగలించుకుపోవడం తప్ప ఏమీ చేయలేదన్నారు. ఒక్క ఇల్లు కట్టలేని జోకర్ జోగి.. చంద్రబాబు ఇంటిపైకి వచ్చి దాడి చేస్తానని చెబుతున్నాడు. దమ్ము, ధైర్యం ఉంటే ఇప్పుడు రా అంటూ జోగి రమేష్‌కు లోకేష్ సవాల్ విసిరారు.