Nellore Rottela Panduga : నెల్లూరు బారాషహీద్ దర్గాలో రొట్టెల పండగ ఎందుకు నిర్వహిస్తారంటే..?
Nellore Rottela Panduga : నెల్లూరులోని బారాషహీద్ దర్గా... రొట్టెల పండగకు సిద్ధమైంది.
Nellore Rottela Panduga : నెల్లూరులోని బారాషహీద్ దర్గా... రొట్టెల పండగకు సిద్ధమైంది. ఇవాల్టి నుంచి ఐదు రోజుల పాటు... ఈ పండుగ జరగనుంది. ఆఖరి రోజు 13వ తేదీని ముగింపు ఉత్సవంతో రొట్టెల పండగను వైభవంగా నిర్వహించనున్నారు. కరోనా కారణంగా రెండేళ్లుగా నిలిపివేసిన ఈ ఉత్సవాలను... ప్రస్తుతం కరోనా ఉద్ధృతి తగ్గడంతో భక్తులను అనుమతించనున్నారు. దీంతో దర్గాను విద్యుత్ దీపాలంకరణతో అందంగా ముస్తాబు చేశారు.
దేశవిదేశాల నుంచి లక్షల్లో భక్తులు తరలిరానుండటంతో... రొట్టెల పండగ కమిటీ, జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఏర్పాట్లున్నీ పూర్తయిపోయాయి. ఎలాంటి తొక్కిసలాలు, ఘర్షణలు జరగకుండా చర్యలు చేపట్టారు.
ఇవాళ షాహాదత్ రోజున సొందల్‌మాలీ నిర్వహిస్తారు. అలాగే 10న రాత్రి గంధోత్సవం, 11న రొట్టెల పండగ, 12న తహలీల్ ఫాతెహా జరుపుతారు.. ఇక ఆఖరిరోజు 13 తేదీన ముగింపు ఉత్సవం జరుగుతుంది. ఈ రొట్టెల పండగలో ప్రధాన ఘట్టం గంధ మహోత్సవం.
పవిత్ర గంధాన్ని ముజావర్లు దర్గాలోని సమాధులపై లేపనం చేస్తారు. అనంతరం ఆ గంధాన్ని స్వర్ణాల చెరువులో కలుపుతారు. ఆ తర్వాత చెరువులోని నీటికి మహత్యం వస్తుందని అందులో పవిత్ర స్నానమాచరిస్తారు భక్తులు. అదే సమయంలో స్వర్ణాల చెరువులో నిలబడి రొట్టెలు మార్చుకుంటారు. కోర్కెల రొట్టెలను స్వీకరిస్తారు.
గత రెండేళ్లుగా కరోనా వల్ల రొట్టెల పండగ సందడి లేదు. కేవలం ముజావర్లు మాత్రమే బారాషహీద్ దర్గాకు వచ్చి గంధ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ ఏడాది రొట్టెల పండగను భారీ హంగామాతో నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. రద్దీ ఎక్కువగా ఉంటుందనే ఉద్దేశంతో అటు భక్తులు కూడా ముందుగానే నెల్లూరుకు వచ్చి దర్గాను దర్శించుకుని వెళ్లిపోతున్నారు.
ఈ రొట్టెల చరిత్ర విషయానికొస్తే... టర్కీ నుంచి మహ్మద్ ప్రవక్త సందేశాన్ని ప్రపంచ వ్యాప్తం చేయడంలో భాగంగా 12 మంది మతబోధకులు భారతదేశానికి వచ్చారని.. ఆ సమయంలో కొడవలూరు మండలంలోని గండవరంలో తమిళనాడు వాల్జారాజులకు, బీజాపూర్ సుల్తాన్‌లకు మధ్య పవిత్ర యుద్ధం జరిగిందని స్థల పురాణం చెబుతోంది. ఆ యుద్ధంలో టర్కీ కమాండర్, మత ప్రచారకుడు జుల్ఫేఖార్ బేగ్‌తో పాటు 11 మంది వీర మరణం పొందారని... వారి తలలు గండవరంలో తెగి పడగా.. మొండాలను గుర్రాలు నెల్లూరులోని స్వర్ణాల చెరువు వద్దకు తీసుకువచ్చాయని చరిత్ర చెబుతోంది.
వీరమరణం పొందిన 12 మంది నెల్లూరు ఖ్వాజీకి కలలో కనపడి తమను అక్కడే సమాధి చేయాలని కోరడంతో అక్కడే సమాధులు నిర్మించారు. 12 సంఖ్యను ఉర్దూలో బారా, వీర మరణం పొందిన అమరులను ఉర్దూలో షహీద్‌లుగా పిలువబడతారు. అందుకే ఈ దర్గాకు బారాషహీద్ అనే పేరు వచ్చిందని అక్కడివారు చెబుతున్నారు.