విజయవాడ ఇంద్రకీలాద్రిపై నెలకొని ఉన్న ప్రసిద్ధ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడానికి భారీ ప్రణాళిక సిద్ధమైంది. విజన్ 2029 లో భాగంగా రూ.100 కోట్ల అంచనా వ్యయంతో 20కి పైగా ప్రాజెక్టులను రూపొందించారు. భక్తుల సౌకర్యాలను కేంద్రంగా చేసుకుని, వాతావరణహిత శ్రద్ధతో ఆలయాన్ని ఆధునీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రముఖంగా సమస్యగా మారిన పార్కింగ్ కోసం కనకదుర్గానగర్‌లో మల్టీ లెవెల్ కార్ పార్కింగ్, ఆరు లైన్ల రహదారి విస్తరణ, భక్తుల బస్సులకు ప్రత్యేక బస్‌టెర్మినల్, కాలిబాటలు, ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్‌ను అమలు చేయనున్నారు. ఇంద్రకీలాద్రి పరిసరాలను పచ్చదనంతో నింపేందుకు పార్కులు, నీటి ఫౌంటెయిన్లు ఏర్పాటు చేయనున్నారు. ఆలయ భద్రత కోసం ఆధునిక సీసీటీవీ కెమెరాలు, మోషన్ డిటెక్టర్లు, డ్రోన్లు వినియోగించనున్నారు. శుద్ధమైన నీరు, సౌర విద్యుత్, వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక సదుపాయాలు కూడా అందుబాటులోకి రానున్నాయి.
భక్తుల వసతి కోసం 100 గదుల గెస్ట్‌హౌస్, విశ్రాంతి మందిరం, 2,000 మందికి సరిపడే భోజనశాల, 24 గంటల వైద్య కేంద్రం, పిల్లల సంరక్షణ కేంద్రం, వయోజనుల కోసం సేవా కేంద్రం ఏర్పాటు చేయనున్నారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక అభివృద్ధికి కల్యాణ మండపం, సత్సంగ్ హాల్, ధార్మిక గ్రంథాలయం, ఆధునిక కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులన్నింటినీ 2029 నాటికి పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. దుర్గగుడిని ప్రపంచ స్థాయి ఆలయంగా తీర్చిదిద్దే దిశగా ఈ ప్రణాళికలు నడుస్తున్నాయి.