PAWAN: చిన్న విజయం… పెద్ద ప్రస్థానానికి నాంది: పవన్ కళ్యాణ్
భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి బలమైన ఆరంభమన్న పవన్ కళ్యాణ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై జనసేన పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. తెలంగాణలో జనసేన పార్టీ సాధించిన తొలి విజయాన్ని చారిత్రాత్మక మైలురాయిగా అభివర్ణించారు. పార్టీ ఆవిర్భావం జరిగిన నేలపై తొలి ఎన్నికల విజయం నమోదు కావడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. తెలంగాణలో మొత్తం 2998 స్థానాలున్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జనసేన పార్టీ 332 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఈ పోటీలో ఒక కౌన్సిలర్ స్థానం, ఒక కార్పొరేటర్ స్థానం దక్కించుకోవడం ద్వారా పార్టీ ఖాతా తెరిచింది. నేరేడుచర్ల మున్సిపాలిటీలో ఆరూరి విజయలక్ష్మి కౌన్సిలర్‌గా విజయం సాధించగా, మంచిర్యాల కార్పొరేషన్‌లో అగ్గు సాగర్ కార్పొరేటర్‌గా గెలుపొందారు. ఈ విజయాలను భవిష్యత్ రాజకీయ ప్రస్థానానికి బలమైన ఆరంభంగా పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
పార్టీ ప్రారంభ దశలను స్మరించుకుంటూ ఆయన భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. జనసేన ఆవిర్భావ సమయంలో ఎన్నో అవరోధాలు, అనిశ్చితులు ఎదురయ్యాయని, భవిష్యత్తు ఎలా ఉంటుందనే ప్రశ్నలు వెంటాడాయని చెప్పారు. ఆ సమయంలో చిన్నపాటి ఆసరా కూడా లేకపోయినా, ఆశావాదంతో ముందుకు సాగిన క్షణాలను గుర్తు చేసుకున్నారు. పార్టీ సిద్ధాంతాలను విశ్వసించిన మహిళా శక్తి, కార్యకర్తల త్యాగం, నిబద్ధతే ఈ విజయానికి పునాది అని ఆయన స్పష్టం చేశారు. “మహా వృక్షమైనా చిన్న విత్తు నుంచే నేల పొరలను చీల్చుకుని మొలకెత్తుతుంది. విశ్వవిజేత కూడా తల్లి గర్భంలో అణువంతే మొదలవుతాడు” అంటూ పవన్ కళ్యాణ్ ఉపమానాలతో తన సందేశాన్ని వివరించారు. తెలంగాణలో జనసేన విజయ యాత్ర లేలేత అడుగులతో ప్రారంభమైందని, ఈ చిన్న విజయాలు భవిష్యత్తులో భారీ మార్పులకు దారితీస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ మహిళల పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, ఝాన్సీ లక్ష్మీభాయి స్ఫూర్తితో వీర మహిళలు ఉద్యమాత్మకంగా ముందుకు వచ్చినట్లు ఆయన అభినందించారు. జనసేన సిద్ధాంతాలకు కట్టుబడి, ఎలాంటి ఒడిదుడుకులనైనా తట్టుకుని నిలబడిన కార్యకర్తల ధైర్యసాహసాలు ప్రశంసనీయం అని అన్నారు. పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి జనసైనికుడికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
నేరేడుచర్లలో విజయం సాధించిన ఆరూరి విజయలక్ష్మి, మంచిర్యాలలో గెలిచిన అగ్గు సాగర్‌లకు ఆయన హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. ఈ ఇద్దరి విజయాలు పార్టీకి నూతనోత్సాహం నింపాయని పేర్కొన్నారు. తెలంగాణలో జనసేన పునాది బలపడటానికి ఇది తొలి అడుగు అని అభిప్రాయపడ్డారు. పార్టీ పుట్టిన నేల తెలంగాణ అని గుర్తుచేసిన పవన్ కళ్యాణ్, ఆ నేలపై తొలి ఎన్నికల విజయం సాధించడం తనకు ప్రత్యేక సంతృప్తిని కలిగించిందన్నారు. పోరాట పటిమ, సంస్కృతి సంప్రదాయాల గొప్పతనం, సాహితీ సౌరభం కలగలిసిన తెలంగాణ నేలకు ఆయన హృదయపూర్వక వందనం తెలిపారు.