Prakasam barrage : బోట్ల వెలికితీత ప్రయత్నాలు విఫలం,
మరో కొత్త ప్లాన్ అమలు చేస్తున్న ఇంజినీర్లు;
ప్రకాశం బ్యారేజీ వద్ద అదికారులు, నిపుణులను బోట్లు ముప్పతిప్పలు పెడుతున్నాయి. ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకున్న బోట్ల తొలగింపు ప్రక్రియ కష్టంగా మారింది. బోట్లను ఒడ్డుకు తీసేందుకు ఆరు రోజులుగా తీవ్రంగా శ్రమిస్తోన్నా ఫలితం కనపడటం లేదు. అబ్బులు బృందం ఒక పడవను కూడా బయటకు తీసుకుని రాలేదు. దీంతో మరో ప్రణాళికను బెకెం సంస్థ అమలు చేయాలని నిర్ణయించింది. రెండు భారీ పడవలను గడ్డర్లతో కలిపి ఇంజినీర్లు అనుసంధానిస్తున్నారు. ఆ పడవల్లో ఇసుక, నీరు నింపి చిక్కుకున్న పడవలను వెలుపలకు తీసుకు వచ్చే ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద అడ్డుపడి చిక్కుకుపోయిన పడవల తొలగింపు ప్రక్రియ ఆరోరోజూ కొనసాగుతోంది. పడవలను ఒడ్డుకు తెచ్చేందుకు ఇంజినీర్లు, అధికారులు, బోట్లు వెలికి తీసే నిపుణులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇసుకలో ఇరుక్కోవడంతో బోట్ల వెలికితీత ప్రక్రియ సంక్లిష్టంగా మారింది.
ఈనెల 1న భారీ ప్రవాహానికి ఎగువ నుంచి వేగంగా కొట్టుకు వచ్చిన 5 బోట్లు బ్యారేజీ గేట్లను బలంగా ఢీకొట్టాయి. 67, 69, 70 గేట్ల వద్ద కౌంటర్ వెయిట్లు ధ్వంసమయ్యాయి. ప్రవాహంలో ఒక పడవ దిగువకు కొట్టుకు పోగా, 3 భారీ పడవలు, ఒక మోస్తరు పడవ కలిపి గేట్లవద్దే చిక్కుకున్నాయి. ఈ పడవలకు ఒకదానితో మరొకటి కట్టి వదలడంతో లంకె పడ్డాయి. దీంతో బ్యారేజీ గేట్లకు అడ్డుపడి ప్రవాహాన్ని అడ్డుకుంటున్నాయి. అడ్డుపడిన భారీ పడవలను తొలగించేందుకు కాకినాడకు చెందిన అబ్బులు బృందం శుక్రవారం నుంచి తీవ్రంగా శ్రమిస్తోంది.
భారీ పడవకు ఇనుప రోప్ కట్టి ప్రొక్లెయిన్‌తో బయటకు లాగేందుకు ప్రయత్నించారు. ఒడ్డుకు చేర్చేందుకు మూడురోజులుగా ప్రయత్నిస్తున్నా కేవలం 20 మీటర్ల మేర మాత్రమే బోటు వెనక్కి కదలింది. ఒక్కోటి 40 టన్నుల పైగా బరువుండి ఒకదానితో మరొకటి లంకెపడటంతో 3 భారీ పడవలు కదలడం లేదు. ఒక పడవను బయటకు తీసే క్రమంలో ఇసుకలో చిక్కుకుపోవడంతో ఆటంకం ఏర్పడింది.
నదిలో ప్రవాహం పెరగుతుండటంతో వాటి తొలగింపు సంక్లిష్టంగా మారింది. వందటన్నుల బరువు లాగే ప్రొక్లెయిన్‌కు రోప్‌లు కట్టి ఒడ్డుకు చేర్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. బ్యారేజీ ఎగువ వైపునుంచి భారీ పడవలను అధికారులు తెప్పిస్తున్నారు. చిక్కుకున్న పడవలను వాటికి కట్టి ఒడ్డుకు తెచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.