PRESIDENT: మానవాళికి సేవ చేసేందుకే వైద్యవృత్తి

మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము.. విద్యార్థులకు బంగారు పతకాలు అందించిన ముర్ము;

Update: 2024-12-18 04:30 GMT

ఆరోగ్యకరమైన, అభివృద్ధి సాధించే భారతదేశం మనందరికీ కావాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్‌ మొదటి స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముర్ము ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 49 మంది ఎంబీబీఎస్‌ విద్యార్థులకు డిగ్రీలు, పోస్టు డాక్టోరల్‌ సర్టిఫికెట్స్‌ కోర్స్‌ పూర్తి చేసిన మరో నలుగురు విద్యార్థులకు రాష్ట్రపతి ముర్ము బంగారు పతకాలు అందించారు. మానవాళికి సేవ చేసేందుకు వైద్య వృత్తిలోకి ప్రవేశించిన మీరు.. అందుకు సార్థకత చేకూర్చాలని యువ వైద్యులకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పిలుపునిచ్చారు. రోగులకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా వైద్య వృత్తికి గౌరవాన్ని తేవాలని సూచించారు. "వైద్యవృత్తిలోకి ప్రవేశించిన విద్యార్థులు గౌరవం, అభ్యసనం, పరిశోధన రంగాలపై దృష్టిపెట్టాలి. వీటిలో దేనికి ప్రాధాన్యమివ్వాలన్న ఆలోచన వస్తే, రోగులకు అందించే ఉత్తమ వైద్యసేవలతో మీ వృత్తికి కీర్తి ప్రతిష్ఠలు లభిస్తాయని గుర్తించాలి.” అని రాష్ట్రపతి విద్యార్థులకు పిలుపునిచ్చారు.


మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి..

ఎయిమ్స్ మొదటి స్నాతకోత్సవం ఇదని... ప్రతి సంవత్సరం నిర్వహించాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. పానకాల స్వామికి తన ప్రార్ధన అని.. లక్ష్మీనరసింహ స్వామి ఆశీస్సులు అందరికీ ఉండాలన్నారు. యువ వైద్యులుగా మీరందరూ అత్యుత్తమ సేవలందించాలని... ఇప్పుడు డాక్టర్లు అయిన వారిలో 2/3 వంతు మహిళా డాక్టర్లు. మన భారత మహిళలు, యువతులు అన్ని రంగాలలో ఉన్నతి సాధించాలని రాష్ట్రపతి పిలుపునిచ్చారు. దేశ ప్రజలందరూ ఆరోగ్యవంతులుగా ఉండాలి. పూర్తి ఆరోగ్యంపై అందరూ దృష్టి పెట్టాలి. ప్రతీరోజూ ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలి.యోగాసనాలు, ప్రాణాయామాలు చేయడం ఆరోగ్యంగా ఉండటానికి అవసరం. సమయం, పరిస్ధితులను బట్టి ప్రతీ మనిషి జీవనశైలి ఉండాలి.మెడికల్ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందిస్తారని ఆశిస్తాను. 

సేవాస్ఫూర్తి ఉండాలన్నా రాష్ట్రపతి

సేవాస్ఫూర్తి, నిత్య అభ్యాసన, నూతన ఆవిష్కరణలపై ఆకాంక్ష ఉంటే కచ్చితంగా సమాజంలో విజయం, గౌరవం దక్కుతాయని రాష్ట్రపతి అన్నారు. యువ వైద్యులు గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంత ప్రజల ఆరోగ్యానికి భరోసా కల్పించాలని ముర్ము తెలిపారు. అంతా సమష్టిగా పనిచేసి ఆరోగ్యకరమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మిద్దామని వెల్లడించారు. మెడికల్‌ టెక్నాలజీ ఎడ్యుకేషన్‌తో అందరికీ ఉపయోగపడే సేవలు అందుబాటులోకి తేవాలని రాష్ట్రపతి తెలిపారు. మన వైద్యులు భారత్‌ను ప్రపంచ పటంలో అత్యున్నత స్థాయి వైద్యసేవల స్థానంగా నిలిపారన్నారు. ప్రతి డాక్టర్‌ సేవకే తొలి ప్రాధాన్యమివ్వాలని రాష్ట్రపతి ఉద్బోధించారు.

Tags:    

Similar News