స్వర్ణాంధ్రను శిథిలం చేసి, అన్ని వర్గాలనూ వెంటాడి వేధించిన జగన్ వికృత వ్యక్తిత్వంపై పోటెత్తిన ప్రజాగ్రహమే తెలుగుదేశం, జనసేన, భాజపా కూటమి ఘన విజయం! వైకాపా భ్రష్టపాలనపై మూడోకన్ను తెరిచిన జనసామాన్యం రాష్ట్రాన్ని పునర్నిర్మించే గురుతర బాధ్యతను 164 సీట్ల అఖండ మెజార్టీతో కూటమి నేతల చేతుల్లో పెట్టింది. 'ఒక్క అవకాశం ఇవ్వండి మంచి పరిపాలన అందిస్తా'నంటూ ఊదరగొట్టి 2019 ఎన్నికల్లో గద్దెనెక్కిన జగన్ రోడ్లు వేయలేదు. పరిశ్రమలను తీసుకురాలేదు. యువతకు ఉపాధి చూపించలేదు ! రైతులకు సాగునీరు ఇవ్వలేదు. దళిత,గిరిజనులకు కనీస భద్రత కల్పించలేదు ! ఇవేమీ చేయని జగన్ విషపూరితమైన 'జె' బ్రాండ్ మద్యంతో ప్రజారోగ్యాన్ని పొట్టనపెట్టుకున్నారు. ఏపీని 'గంజాయి క్యాపిటల్ ఆఫ్ ఇండియా'గా మార్చారు.
వైకాపా ప్రబుద్ధులంతా కలిసి ఇసుక, మట్టి, విలువైన ఖనిజాల దోపిడీ, మద్యం దందాలూ భూముల కబ్జాలతో రాష్ట్రాన్ని యథేచ్ఛగా కొల్లగొట్టారు. ఆ అరాచకాలకు ప్రతిఫలంగానే జగన్ పార్టీని ఏపీ ప్రజలు అధఃపాతాళానికి తొక్కేశారు. ఏపీని అన్ని రంగాల్లో కటిక చీకట్లలోకి లాక్కుపోయిన వైకాపా సర్కారు
రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరంతోపాటు సాగునీటి ప్రాజెక్టుల పనులను జగన్ ప్రభుత్వం అటకెక్కించింది. జలయజ్ఞానికి జెల్లకొట్టడం వల్ల. ప్రాజక్టులనిర్మాణ వ్యయం తడిసిమోపెడు కానుంది. రాష్ట్రంలోనిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తిచేయాలంటే సుమారు 95 వేల కోట్లు అవసరం. ఆ నిధులు సమీకరించడం, జలయజ్ఞం పనులను వేగవంతం చేయడం కూటమి సర్కారుకు అగ్నిపరీక్షే! రాష్ట్రాభివృద్ధికి, ఉద్యోగ ఉపాధి అవకాశాలకు కాణాచి కావాల్సిన అమరావతిని జగన్ సర్వనాశనం చేశారు. ఆయన చేతుల్లో చితికిపోయిన రాజధాని నగరానికి మళ్ళీ జీవంపోసే బృహత్తర కర్తవ్యంలో నూతన సర్కారు నెగ్గుకురావడమూ కత్తిమీద సామే!
జగన్ మూలంగా సర్వభ్రష్టమైన వ్యవస్థలను కూటమి సర్కారు పూర్తిగా ప్రక్షాళించాలి. వైకాపాతో అంటకాగి ప్రజాప్రయోజనాలకు పాతరేసిన అధికారులను బోనెక్కించాలి. జగన్ సేవలో తరించిన పోలీసులు అందరినీ ఏరిపారేయాలి. వైకాపా నేతల అండదండలతో గడచిన అయిదేళ్లలో మానవ హక్కుల్ని కబళించిన వారందరినీ గుర్తించి కటకటాల్లోకి నెట్టాలి. రోతబూతులతో సామాజిక మాధ్యమాలను మురుగుకాల్వలుగా మార్చేసి, న్యాయస్థానాలు, న్యాయమూర్తులపైనా విషంకక్కిన వైకాపా మూకలపై ఉక్కుపాదం మోపాలి. జాతివనరులను దోచుకుతిని.... ఆర్థిక నేరాభియోగాలను నెత్తినమోస్తూ, పదేళ్లకుపైగా బెయిల్‌పై ఉంటున్న జగన్ విధ్వంసకాడకు యావత్ ఆంధ్రప్రదేశ్ బలైంది. అలాంటి రాజకీయ చీడపురుగులు దేశంలో మరెక్కడా మళ్ళీ పదవుల్లోకి ప్రవేశించకుండా జనం బతుకులతో చెలగాటమాడకుండా నేరన్యాయ వ్యవస్థ క్రియాశీలం కావాలి