SC: సినీ నటి ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు
ప్రత్యూష కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు... నిందితుడు లొంగిపోవాలని సుప్రీం తీర్పు... సిద్ధార్ధరెడ్డి పిటిషన్ కొట్టేసిన సుప్రీంకోర్టు
రెండు దశాబ్దాల క్రితం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సినీనటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. ఈ కేసులో హైకోర్టు విధించిన శిక్షను సవాల్ చేస్తూ నిందితుడు గుడిపల్లి సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. దీంతో హైకోర్టు ఖరారు చేసిన రెండేళ్ల జైలుశిక్ష అమలులోకి రానుంది. అదేవిధంగా సిద్ధార్థరెడ్డి నాలుగు వారాల్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు 2002 ఫిబ్రవరి 23న చోటుచేసుకున్న ఘటనకు సంబంధించినది. అప్పట్లో యువనటి ప్రత్యూష, సిద్ధార్థరెడ్డి ఇద్దరూ హైదరాబాద్‌లో ఇంటర్ చదివే సమయంలో పరిచయం అయ్యి ప్రేమించుకున్నారు. ఇంటర్ పూర్తయ్యాక ప్రత్యూష సినిమాల్లోకి అడుగుపెట్టగా, సిద్ధార్థరెడ్డి ఇంజినీరింగ్ చదువుకు చేరాడు. 2002 ఫిబ్రవరి 23 సాయంత్రం 7.30 నుంచి 8 గంటల మధ్య ఇద్దరూ విషం సేవించిన పరిస్థితిలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. తదుపరి రోజు ఫిబ్రవరి 24న ప్రత్యూష మరణించగా, చికిత్స అనంతరం సిద్ధార్థరెడ్డి మార్చి 9న డిశ్చార్జ్ అయ్యాడు. పరీక్షల్లో వారు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి తాగినట్లు గుర్తించారు. ప్రత్యూష మృతికి ఆర్గానోఫాస్ఫేట్ అనే విషపదార్థమే కారణమని వైద్యుల నివేదిక వెల్లడించింది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ముగ్గురు వైద్యుల బృందం పోస్టుమార్టం అనంతరం సమర్పించిన నివేదికలో ఊపిరాడకుండా చేయడం, లైంగిక దాడి వంటి అంశాలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది.
ఈ ఆధారాల ఆధారంగా దర్యాప్తు చేపట్టిన సీబీఐ, సిద్ధార్థరెడ్డిపై భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), సెక్షన్ 309 (ఆత్మహత్యాయత్నం) కింద అభియోగాలు మోపింది. విచారణ అనంతరం హైదరాబాద్ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు 2004 ఫిబ్రవరి 23న సిద్ధార్థరెడ్డికి ఐదేళ్ల కఠిన కారాగారశిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ సిద్ధార్థరెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. 2011 డిసెంబర్ 28న హైకోర్టు శిక్షను ఐదేళ్ల నుంచి రెండేళ్లకు తగ్గిస్తూ, జరిమానాను రూ.50,000కు పెంచుతూ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పుపై ఇద్దరూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ అనంతరం సుప్రీంకోర్టు గతంలో తీర్పును రిజర్వ్ చేసి తాజాగా తుది నిర్ణయం వెల్లడించింది. పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ నిపుణుడు మునిస్వామి ఇచ్చిన విశ్లేషణ, ఆరోగ్య నివేదికలు, ఇతర సాక్ష్యాలు సహా ఏడు ముఖ్య ఆధారాలను సమగ్రంగా పరిశీలించిన ధర్మాసనం, సిద్ధార్థరెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. హైకోర్టు ఇచ్చిన రెండేళ్ల జైలుశిక్షను సమర్థిస్తూ, అతను నాలుగు వారాల్లో లొంగిపోవాలని ఆదేశించింది.
దీంతో రెండు దశాబ్దాలుగా నడుస్తున్న ఈ కేసుకు న్యాయపరంగా ముగింపు లభించింది. ప్రత్యూష మృతి అప్పట్లో తెలుగు సినీ పరిశ్రమలోనే కాక సమాజంలో కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో కేసు మరో కీలక మలుపు తిరిగింది.