Jagan: జగన్ కేసుల ట్రయల్ లో జాప్యం ఎందుకు
అఫిడవిట్ వేయాలంటూ సీబీఐకు సుప్రీం ఆదేశాలు;
జగన్ అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఆలస్యం ఎందుకు అమవుతోందని సీబీఐని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. దీనికి గల కారణాలు చెబుతూ నాలుగు వారాల్లో అఫిడవిట్ దాఖలు చేయాలని.. విచారణ వేగంగా పూర్తిచేయాలని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఆదేశించింది. డిశ్చార్జ్ పిటిషన్ల కారణంగా జాప్యమవుతోందని సీబీఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వీ రాజు కోర్టుకు తెలిపారు. రాజకీయ కారణాలతో ట్రయల్ ఆలస్యం కాకూడదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
హైదరాబాద్‌లోని సీబీఐ ప్రత్యేక కోర్టులో జగన్ కేసుల విచారణలో సుదీర్ఘ జాప్యం జరుగుతున్నందున వాటిని వేరే రాష్ట్రానికి బదిలీచేయాలని, అధికారాన్ని అడ్డుపెట్టుకొని విచారణపై ప్రభావం చూపుతున్న ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ ఎంపీ రఘురామకృష్ణరాజు రెండు పిటిషన్లు వేయగా.....వాటిపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్‌దత్తలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమవారం విచారణ ప్రారంభమైన వెంటనే రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ వాదనలు ప్రారంభిస్తూ.. ట్రయల్ కోర్టులో ప్రతివాదులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్లపై వెంటనే నిర్ణయం వెలువరించాలని గత విచారణ సందర్భంగా ధర్మాసనం ఆదేశించినా ఇంత వరకూ పురోగతి కనిపించలేదన్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా జోక్యం చేసుకుంటూ ఈ పిటిషన్లను తాము ఒకదాని తర్వాత మరొకటి పరిశీలిస్తామన్నారు. విచారణను మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని దాఖలు చేసిన కేసు మనుగడ సాగించడానికి అవకాశం ఉందా అని ప్రశ్నించారు. ఉందని న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ బదులిచ్చారు. కింది కోర్టులో ట్రయల్ జరగడం లేదన్న ఉద్దేశంతోనే ఇందులో సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసిందన్నారు. ఒకవేళ కేసులను వేరే రాష్ట్రానికి బదిలీ చేసినా ఆ పరిస్థితి తలెత్తవచ్చు కదా అని న్యాయమూర్తి అనుమానం వ్యక్తం చేశారు. ఇదివరకు రాజకీయ సమీకరణాల వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయని, ఇప్పుడు అవి అయిపోయాయని పేర్కొంటూ.. సమీపంలో ఎన్నికలు ఉన్నందున దానికి అనుగుణంగా తాము ఈ కేసు విచారణ తేదీ ఖరారు చేస్తామని చెప్పారు.