సీఎస్‌ నీలం సాహ్నికి ఎస్‌ఈసీ నిమ్మగడ్డ మరో లేఖ

Update: 2020-11-24 02:05 GMT

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పూర్తి సహకారం అందించాలని సీఎస్‌ నీలం సాహ్నికి మరోసారి లేఖ రాశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌. ఎన్నికల నిర్వహణపై జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించాలని ఎస్‌ఈసీ రెండు సార్లు చేసిన ప్రయత్నాలకు ప్రభుత్వం గండి కొట్టింది. ప్రభుత్వానికి ఎస్‌ఈసీ లేఖ రాసినప్పటికీ కరోనా సెకండ్‌ వేవ్‌ ఉందంటూ సీఎస్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు సంబంధించి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ దేవానంద్‌ ఇచ్చిన తీర్పును జతచేస్తూ ఈ సారి లేఖ రాశారు. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సహకరించాలని ఆ లేఖలో కోరారు.

తమకు కోర్టు తీర్పు ప్రతి అందిన వెంటనే లేఖ రాస్తున్నా అని ఆయన వెల్లడించారు. ఎన్నికల సంఘం వినతిపై ప్రభుత్వం స్పందించి, అవసరమైన ఆర్థిక, ఆర్థికేతర సహకారం అందించాలని ఆర్థిక, పంచాయతీరాజ్‌ శాఖల ముఖ్య కార్యదర్శుల్ని హైకోర్టు ఆదేశించందని లేఖలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కోర్టు ఉత్తర్వుల్ని వారు అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని, ఉత్తర్వుల అమలుపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోర్టు ఆదేశించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మరి ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Tags:    

Similar News