AP BUDGET: ప్రజా రాజధాని అమరావతికి మహర్దశ
రాజధానికి పెద్దపీట వేసిన వార్షిక బడ్జెట్,.. అభివృద్ధి పనుల కోసం రూ.6 వేల కోట్లు.. స్పెషల్ ఎకనామిక్ జోన్కు 28 వేల కోట్లు
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్‌లో ప్రజా రాజధాని అమరావతికి ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. రాజధాని నిర్మాణానికి మళ్లీ ఊపిరి పోసేలా ప్రభుత్వం భారీ కేటాయింపులు ప్రకటించడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. “అమరావతి అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధికి దిక్సూచి” అనే సందేశంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు స్పష్టమైంది. 2026–27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో రాజధాని ప్రాంత మౌలిక వసతుల అభివృద్ధి, రహదారులు, ప్రభుత్వ భవనాలు, డ్రైనేజ్, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయాల విస్తరణకు ప్రత్యేక నిధులు కేటాయించినట్లు ఆర్థికశాఖ మంత్రి సభలో వెల్లడించారు. అమరావతిని కేవలం పరిపాలనా కేంద్రంగా కాకుండా, ఆర్థిక, విద్యా, ఐటీ, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్ వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2026-27 ఆర్థిక సంవత్సరానికి రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్నట్లు పేర్కొన్నారు. అయితే, ఇందులో రాజధాని అమరావతికి పెద్దపీట వేశారు. క్యాపిటల్ సిటీలో అభివృద్ధి పనుల కోసం రూ.6 వేల కోట్ల నిధులు కేటాయించబోతున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా అంతర్జాతీయ సంస్థలకు హబ్‌గా ఉన్న విశాఖ స్పెషల్ ఎకనామిక్ జోన్‌కు రూ. 28 వేల కోట్లు కేటాయించారు. ఇక నారా లోకేశ్ మంత్రిగా ఉన్న విద్యా శాఖకు రూ.32,308 కోట్లు ప్రకటించడం పట్ల రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంక్షేమానికి పెద్దపీట వేసింది. సమాజీక వర్గాలు, మైనార్టీ వర్గాల అభివృద్ధి కోసం ఈ బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీ కాంపోనెంట్ కోసం ఏకంగా రూ. 51,021 కోట్లు కేటాయించడం ఆ వర్గాల పట్ల ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని చాటిచెబుతోంది. అలాగే ఎస్సీ కాంపోనెంట్ కోసం రూ. 20,644 కోట్లు, ఎస్టీ కాంపోనెంట్ కోసం రూ. 9,190 కోట్లు. మైనార్టీ వర్గాల సంక్షేమం కోసం రూ. 6,090 కోట్లు కేటాయించి ప్రభుత్వం ఆయా వర్గాలకు భారీ శుభవార్త వినిపించింది. మౌలిక సదుపాయాల కల్పనకు కూడా బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యత లభించింది. రాష్ట్రంలోని పేదలందరికీ సొంతింటి కలను నిజం చేసే లక్ష్యంతో గృహ నిర్మాణ శాఖకు రూ. 6,357 కోట్లు కేటాయించారు. అలాగే ప్రజారవాణా, రహదారులు, భవనాల శాఖకు రూ. 9,856 కోట్లు కేటాయించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా కనెక్టివిటీని పెంచేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే కాకుండా, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడం ద్వారా రాష్ట్ర ప్రగతికి ఈ బడ్జెట్ బాటలు వేయనుంది.