AMARAVATHI: అమరావతిలో స్పోర్ట్స్ సిటీ
రూ.50 కోట్లతో విశాఖ స్టేడియం అభివృద్ధి పనులు... విజయనగరంలో క్రికెట్ అకాడమీ;
అమరావతిలోని స్పోర్ట్స్ సిటీలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం రాబోతోందని ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ ఛైర్మన్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. మంత్రి నారా లోకేశ్ సహకారంతో ప్రైడ్ ఆఫ్ మంగళగిరి పేరుతో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్ సీజన్-3 పోటీలను మంగళగిరిలోని ఆయన ప్రారంభించారు. ఏసీఏ తరఫున త్వరలో ఏపీఎల్ టోర్నమెంట్ నిర్వహిస్తామని చెప్పారు. నెలాఖరులో విజయనగరంలో క్రికెట్ అకాడమీని ప్రారంభించనున్నట్లు శివనాథ్ వెల్లడించారు. రూ.50 కోట్లతో విశాఖపట్నం స్టేడియంలో ఆధునికీకరణ పనులు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంత్రి లోకేశ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లాలోని 147 ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎనిమిది రకాల క్రీడా పరికరాలు పంపిణీ చేస్తామన్నారు.
ఇంటర్నెట్ గేట్ వే గా విశాఖ
అమరావతిని అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో స్మార్ట్‌టెక్ ఎనేబుల్డ్ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాంకేతిక సలహాలు పొందేందుకు ఐఐటీ మద్రాసుతో క్రీడల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. అంతర్జాతీయ డీప్‌టెక్ పరిశోధన, డిజైన్, ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ పార్కు ఏర్పాటులో సాంకేతిక సలహా కోసం సీఆర్‌డీఏ కూడా ఐఐటీఎంతో ఒప్పందం చేసుకుంది. అధునాతన సాంకేతికతను ఉపయోగించి విశాఖ మహానగరాన్ని ఇంటర్నెట్ గేట్‌వేగా అభివృద్ధి చేయడానికి ఐటీ శాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది.
ఏపీ గ్రీన్ ఫీల్డ్ ఐటీ క్యాపిటల్ గా అమరావతి
అమరావతి ఆశాజనక భవిష్యత్తుపై నిపుణులు, పారిశ్రామికవేత్తలు స్పందించారు. ముఖ్యంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టూరిజం రంగాలు అత్యధిక వృద్ధిని నమోదు చేయనున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు, వారి కుటుంబాల వలసలకు ఊతమిచ్చేలా సౌకర్యాలను అభివృద్ధి చేయడమే ప్రభుత్వ తక్షణ ప్రాధాన్యమని నిపుణులు అభిప్రాయపడ్డారు. అమరావతి టోపోగ్రాఫికల్ స్థానం స్థిరమైన, ప్రణాళికాబద్ధమైన, హరిత నగరాన్ని అభివృద్ధి చేయడానికి ప్రేరణ ఇస్తుందని భావిస్తున్నారు.