SRISAILAM: శ్రీశైలంలో నేటి నుంచే మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు
భారీ ఏర్పాట్లు చేసిన ఆలయ అధికారులు
ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీశైలం మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. నేటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు దేవస్థానం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే భక్తుల రాక పెరుగుతున్న నేపథ్యంలో సౌకర్యాలు, భద్రత, దర్శన విధానాల్లో ప్రత్యేక చర్యలు తీసుకున్నారు అధికారులు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఉదయం శ్రీ స్వామివారి యాగశాల ప్రవేశంతో ఉత్సవాలకు అధికారికంగా శ్రీకారం చుట్టనున్నారు. ఎల్లుండి నుంచి శ్రీ స్వామి, అమ్మవార్లకు వివిధ వాహన సేవలు, గ్రామోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాల సమయంలో భక్తులకు సాధారణ దర్శనాల స్థానంలో అలంకార దర్శనానికే అనుమతి ఇవ్వనున్నారు.
జ్యోతిర్ముడి శివస్వాములకు మాత్రమే ఈ నెల 12వ తేదీ వరకు, అది కూడా నిర్ణీత సమయాల్లో స్పర్శ దర్శనానికి అవకాశం కల్పించనున్నారు. భక్తులు, శివస్వాముల రద్దీని దృష్టిలో ఉంచుకుని సుమారు 40 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు వెల్లడించారు. రవాణా సౌలభ్యం కోసం ఈ నెల 13 నుంచి 16 వరకు, ముఖ్యంగా 15, 16 తేదీల్లో టోల్ గేట్ లేకుండా వాహనాలను శ్రీశైలం వరకు అనుమతించనున్నారు. అలాగే ఈ నెల 12న రాష్ట్ర ప్రభుత్వం తరఫున శ్రీ స్వామి, అమ్మవార్లకు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.
మహా శివరాత్రి సందర్భంగా లక్షలాది భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పుణ్యస్నానాలు, దర్శనాలు, వాహన సేవలను సక్రమంగా తిలకించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు దేవస్థాన అధికారులు తెలిపారు. భక్తులందరూ నిబంధనలు పాటించి సహకరించాలని వారు కోరుతున్నారు.