Andhrapradesh: రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన భూ రిజిస్ట్రేషన్లు
సోమవారం సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ల నెట్‌వర్క్ స్తంభించిపోయిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు;
ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్రవ్యాప్తంగా భూ రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. సోమవారం సర్వర్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రిజిస్ట్రేషన్ల నెట్‌వర్క్ స్తంభించిపోయిందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఐతే.. భూములపై పెంచిన మార్కెట్ రేట్లను ప్రభుత్వం జూన్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనుందనే వార్తల నేపథ్యంలో.. ఈలోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకుందామని జనం భారీ సంఖ్యలో రిజిస్ర్టేషన్ కార్యాలయాలకు తరలివస్తున్నారు. దీంతో సోమవారం ఉదయం నుంచే అన్ని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు జనాలతో కిటకిటలాడాయి. కానీ, రిజిస్ట్రేషన్లు జరగకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. సబ్ రిజిస్ట్రార్లు, అక్కడి ఉద్యోగులతో కొందరు వాగ్వాదానికి దిగారు. ధరల పెంపును క్యాష్ చేసుకునేందుకే ప్రభుత్వం సాంకేతిక సమస్య అంటూ నాటకాలాడుతోందని కొందరు విమర్శిస్తున్నారు. ఇవాళ ఈ సమస్య పరిష్కారమయ్యే అవకాశాలున్నాయంటున్న రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు.. పరిష్కారం కాకపోతే రిజిస్ట్రేషన్ కార్యాలయాల వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
కొత్త జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో భూముల మార్కెట్ విలువ 25 నుంచి 30 శాతం వరకు పెరగనుందని తెలుస్తోంది. కొత్త జిల్లాల్లో గతేడాది భారీగా రేట్లు పెంచారు. దీంతో ఈసారి ఆ జిల్లాల్లో 10 నుంచి 15 శాతం వరకు మాత్రమే పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. మరికొన్ని చోట్ల 35 శాతానికి పైగా పెంచారు. మార్కెట్ విలువ పెంపు 50 శాతం దాటకుండా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ప్రతి సబ్‌రిజిస్ర్టార్ కార్యాలయ పరిధిలో ఎక్కువ లావాదేవీలు జరుగుతున్న, కంపెనీలు, పరిశ్రమలు, రహదారులకు దగ్గర్లో ఉన్న 20 గ్రామాల్లో భూముల మార్కెట్ విలువ పెంచుతున్నారు. భూముల ధరలు పెరగనున్న నేపథ్యంలో గత రెండు రోజులుగా పెద్ద ఎత్తున రిజిస్ర్టేషన్లు జరుగుతున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు లావాదేవీలు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇదే సమయంలో సర్వర్ స్తంభించటంతో వినియోగదారులు బెంబేలెత్తిపోతున్నారు.
సోమవారం ఉదయం 11.30 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సర్వర్ సమస్య తలెత్తింది. సర్వర్ ఎందుకు పనిచేయటం లేదో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు కూడా తెలియపరచలేదు. విజయవాడలోని పటమట, గాంధీనగర్, గుణదల సబ్ రిజిస్ర్టార్ కార్యాలయాలలో సోమవారం పెద్ద సంఖ్యలో వినియోగదారులు వచ్చారు. ఇక్కడ ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కూడా రోజంతా పడిగాపులు తప్పలేదు. విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోనూ సోమవారం ఒక్క రిజిస్ట్రేషన్ కూడా జరగలేదు. భూముల ధరలు పెరగనున్న నేపథ్యంలో ఆదాయం కోసం కృత్రిమంగా సర్వర్ సమస్యలు సృష్టించారన్న విమర్శలు వస్తున్నాయి. ఉద్దేశపూర్వకంగానే సర్వర్‌ను నిలిపివేశారనే ప్రచారం జరుగుతోంది. సోమవారం రిజిస్ట్రేషన్ల కోసం వచ్చినవారికి పాత రేట్లతోనే రిజిస్ట్రేషన్లు జరిగేలా చూడాలని పలువురు కోరుతున్నారు.