TG: తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య రాజ్యసభ పోటీ

లాబీయింగ్ ఆరంభించిన హస్తం పార్టీ అగ్రనేతలు

Update: 2026-02-20 06:30 GMT

తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న రెండు రాజ్యసభ స్థానాల భర్తీ ప్రక్రియ అధికార కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చలకు దారితీసింది. రాష్ట్రంలో ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్న బీఆర్ఎస్ కు చెందిన ఎంపీ సురేష్ రెడ్డి, అలాగే కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ మను సింఘ్వీ పదవీకాలం వచ్చే ఏప్రిల్‌లో ముగియనుంది. ఈ నేపథ్యంలో వచ్చే నెల 16న ఈ రెండు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అసెంబ్లీలో బలాబలాలను దృష్టిలో ఉంచుకుంటే ఈసారి రెండు సీట్లు కాంగ్రెస్ ఖాతాలో పడే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, పార్టీ నేతల మధ్య రాజ్యసభ టికెట్ కోసం పోటీ ఉధృతమైంది. ఇప్పటికే పార్టీలో ఎటువంటి పదవుల్లో లేని పలువురు సీనియర్ నేతలు రాజ్యసభ అవకాశంపై దృష్టి సారించారు. అందులో ఒక స్థానం జాతీయ నాయకత్వానికి కేటాయించడం దాదాపు ఖాయం అన్న అభిప్రాయం గాంధీభవన్ వర్గాల్లో వినిపిస్తోంది. దీంతో మిగిలిన ఒక్క స్థానానికి రాష్ట్రస్థాయి నేతల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఆశావహుల జాబితా పొడవుగా ఉండటంతో, హైకమాండ్ వద్ద సిఫార్సులు, లేఖలు, మద్దతు కూడగట్టే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు ఇప్పటికే తనకు రాజ్యసభ అవకాశం కల్పించాలని అధిష్ఠానానికి లేఖ రాశారు. పార్టీకి దీర్ఘకాలంగా సేవలందించిన తనకు ఈసారి పెద్దల సభకు వెళ్లే అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. మరోవైపు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. స్పష్టమైన అభిప్రాయాలు వ్యక్తపరచడంలో పేరుగాంచిన జగ్గా రెడ్డి, పార్టీ సీనియర్ల తరఫున అధిష్ఠానం వద్ద రాయబారం సాగిస్తున్నారని సమాచారం. గతంలో ఎమ్మెల్సీ స్థానం విషయంలో కూడా జెట్టి కుసుమకుమార్‌కు అవకాశం ఇవ్వాలని బహిరంగంగా కోరిన విషయం తెలిసిందే.

ఇక జాతీయస్థాయి నాయకత్వానికి అత్యంత సన్నిహితుడైన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీకి మరోసారి రాజ్యసభ అవకాశం కల్పించే దిశగా చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోటా నుంచే ఆయన పేరును ఖరారు చేసే అవకాశముందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే రాష్ట్ర నాయకులు మాత్రం స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని గట్టిగా పట్టుబడుతున్నారు. మిగిలిన ఒక్క స్థానానికి పలువురు ఉద్ధండ నేతలు పోటీ పడుతున్నారు. ఇటీవల ‘ఇండియా’ కూటమి తరఫున ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేసిన సుదర్శన్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయనకు ఉన్న అనుభవం, జాతీయస్థాయి పరిచయాలు పార్టీకి ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన, ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. ప్రభుత్వ విధానాలపై లోతైన అవగాహన కలిగిన ఆయనకు అవకాశం ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి.

ముఖ్యమంత్రి రేవంత్కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందిన, ప్రస్తుతం సీఎం సలహాదారుగా ఉన్న వేం నరేందర్ రెడ్డి కూడా రాజ్యసభ రేసులో ఉన్నారు. ప్రభుత్వ విధానాలపై లోతైన అవగాహన కలిగిన ఆయనకు అవకాశం ఇవ్వాలనే వాదనలు వినిపిస్తున్నాయి.పార్టీలో క్రమశిక్షణ గల నాయకుడిగా పేరున్న జీవన్ రెడ్డి కూడా పెద్దల సభకు వెళ్లాలనే ఆశతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే రాహుల్ గాంధీ వర్గానికి దగ్గరగా ఉన్న మధుయాష్కి గౌడ్ బీసీ కోటాలో తన పేరును పరిశీలించాలని కోరుతున్నారు. సామాజిక సమీకరణాల దృష్ట్యా బీసీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన వాదిస్తున్నారు. ఇంకా ఒక ఆసక్తికర పేరు కే కేశవరావు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన సమయంలో తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన కేకే, తిరిగి అదే స్థానాన్ని తనకు కేటాయించాలని కోరుతున్నట్లు సమాచారం. పార్టీ మారినప్పటికీ తన అనుభవం కాంగ్రెస్‌కు ఉపయోగపడుతుందని ఆయన అనుచరులు భావిస్తున్నారు.

Tags:    

Similar News