కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట విషాదం నింపింది. దేవాలయ సామర్థ్యం 2, 3 వేలు కాగా ఈరోజు ఏకాదశి కావటంతో 25 వేలు మంది వచ్చినట్టు సమాచారం. దీంతో రెయిలింగ్ ఊడి భక్తుల మీద పడటంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఈ క్రమంలో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఆలయ అధికారులు ముందస్తు చర్యలు ఏర్పాటు చేయకపోవటం కూడా కారణంగా తెలుస్తోంది. మంత్రి అచ్చెన్నాయుడు ఘటనాస్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు.
శ్రీకాకుళం జల్లా కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన దుర్ఘటనపై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైయస్ జగన్ స్పందించారు. దుర్ఘటనలో భక్తులు మరణించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. సమాచారం మేరకు 10 మంది మరణించడం అత్యంత బాధాకరమన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
తొక్కిసలాటపై విచారణ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వేంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి అనిత సమగ్ర విచారణకు ఆదేశించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులకు సూచించారు. ఇటు, మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే గౌతు శిరీష.. కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయానికి చేరుకున్నారు. బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించింది.