Adulterated Milk: రాజమండ్రిలో కల్తీ పాలు కలకలం..నలుగురి మృతి?
లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో కల్తీ పాల కలకలం
తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో కల్తీ పాల ఘటన కలకలం రేపుతోంది. లాలాచెరువు, చౌడేశ్వరి నగర్ ప్రాంతాల్లో పలువురు అనారోగ్యానికి గురవ్వడం, ఇప్పటివరకు నలుగురు మృతి చెందడం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. మరో ఆరుగురు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుల్లో వృద్ధులు, చిన్నారులు ఉండటం పరిస్థితి తీవ్రతను మరింత స్పష్టంగా చూపిస్తోంది. వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని అధికారులు చెబుతున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రాజమహేంద్రవరం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని 50వ డివిజన్ లాలాచెరువు చౌడేశ్వరి నగర్‌లో ఈ నెల 16వ తేదీ నుంచి మూత్రం ఆగిపోవడం (అనూరియా), కిడ్నీ సమస్యలు వంటి లక్షణాలతో కేసులు నమోదవుతున్నాయి. ప్రారంభంలో బాధితులు ప్రైవేట్ ఆసుపత్రుల్లోనే చికిత్స పొందారు. అయితే ఆదివారం ఐదుగురి పరిస్థితి ఒక్కసారిగా విషమించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కల్తీ పాలు తాగడమే ఈ సమస్యలకు కారణమని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. నాలుగు రోజుల క్రితం 85 ఏళ్ల కనకలక్ష్మి మృతి చెందినప్పటికీ, ఆ మరణం అధికారికంగా నమోదు కాలేదని సమాచారం. అనంతరం ఆదివారం 65 ఏళ్ల తాడి కృష్ణవేణి కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాజమహేంద్రవరంలోని వివిధ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 13 మంది చికిత్స పొందుతుండగా, వారిలో ఆరుగురు ఐసీయూలో ఉన్నారు. నలుగురి పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి.
యంత్రాంగం అప్రమత్తం
ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. డీఎంహెచ్‌వో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక వైద్య బృందాలు ఏర్పాటు చేసి చౌడేశ్వరి నగర్ ప్రాంతంలో ఇంటింటి సర్వే నిర్వహించారు. అనారోగ్య లక్షణాలు ఉన్నవారిని గుర్తించి తక్షణ చికిత్స అందిస్తున్నారు. కోరుకొండ మండలం నరసాపురానికి చెందిన గణేశ్ అనే పాల వ్యాపారి చాలా కాలంగా ఈ ప్రాంతానికి పాలు సరఫరా చేస్తున్నట్లు తెలిసింది. ఈ నెల 16న విక్రయించిన పాలు చేదుగా ఉండటంతో వాటిని తీసుకున్నవారికి అస్వస్థత కలిగినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కోరుకొండ పోలీసులు గణేశ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పలువురు పాల రైతులను కూడా విచారణ కోసం పోలీస్ స్టేషన్‌కు పిలిచినట్లు సమాచారం. ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపించారు. పరీక్షల ఫలితాలు రావాల్సి ఉంది. మునిసిపల్ అధికారులు మంచినీటి నమూనాలను కూడా పరీక్షించగా వాటిలో ఎటువంటి లోపాలు లేవని తెలిపారు. అయితే పాలలో యూరియా, ఇతర పిండి పదార్థాలు కలుపుతున్నారనే ప్రచారం గతంలో నుంచే ఉన్నప్పటికీ, ఫుడ్ సేఫ్టీ విభాగం పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ప్రభావిత ప్రాంతాల్లో అప్రమత్త పరిస్థితి నెలకొంది. అధికారులు ప్రజలకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. అనుమానాస్పద పాలను వినియోగించవద్దని హెచ్చరిస్తున్నారు. ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు కొనసాగుతుండగా, ప్రయోగశాల నివేదికల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. ఈ విషాద ఘటన పాల నాణ్యతపై మరింత కఠిన నియంత్రణ అవసరాన్ని మరోసారి గుర్తు చేసింది.