NIMMALA: జగన్ అక్రమాస్తి మూడున్నర లక్షల కోట్లు
జగన్ ఓ అవినీతి అనకొండ.... నిమ్మల పవర్ పాయింట్ ప్రజంటేషన్;
తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని లక్షల కోట్లు దోచుకున్న జగన్‌కు చంద్రబాబు గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగుదేశం ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విమర్శించారు. తనపై ఉన్న అవినీతి మరకలను జగన్, అందరికీ అంటించాలని చూస్తున్నారని ఆరోపించారు. వై.ఎస్. జగన్ అవినీతి, అక్రమ సంపాదన, కేసుల వివరాలపై తెలుగుదేశం మాక్ అసెంబ్లీలో పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2014 ఎన్నికలకు ముందు లక్ష కోట్లు ఉన్న జగన్ ఆస్తి.. ఇప్పుడు దాదాపు మూడున్నర లక్షల కోట్లకు చేరిందని నిమ్మల విమర్శించారు. జగన్‌రెడ్డి అధికారం చేపట్టక ముందు, చేపట్టిన తర్వాత దోపిడీ పర్వాన్ని కొనసాగించారని నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.
జగన్‌రెడ్డి 2004-09 మధ్య రూ.1.03 లక్షల కోట్లు, 2019-23 మధ్య రూ.2.55 లక్షల కోట్లు కలిపి మొత్తంగా రూ.3.58 లక్షల కోట్లు అక్రమంగా ఆర్జించినట్లు నిమ్మల లెక్క తేల్చారు. 2004 ఎన్నికల అఫిడవిట్‌లో తన ఆస్తి రూ.1.65 కోట్లని స్వయంగా జగనే పేర్కొన్నారు. అప్పట్లోనే వైఎస్ తన ఆస్తులు రూ.1.74 కోట్లని ఆదాయ పన్ను శాఖకు తెలిపారు. అనధికార లెక్కల ప్రకారం 2004-09 మధ్య వైఎస్ కుటుంబం రూ.1.03 లక్షల కోట్లు ఆర్జించినట్లు తేలింది. ఇందులో రూ.43 వేల కోట్లు సీబీఐ ఛార్జిషీట్ల ద్వారా ఈడీ ఎటాచ్ చేసింది. ఇంకా రూ.60 వేల కోట్లకు సంబంధించిన వివరాలు తేలాల్సి ఉంది. తండ్రి అధికారంతో 2004-09 మధ్య రూ.1.03 లక్షల కోట్లు లూటీ చేసిన జగన్‌రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక 2019-23 మధ్య కేవలం నాలుగేళ్లలో రూ.2,55,000 కోట్లు అక్రమంగా సంపాదించారు. మొత్తంగా ఇప్పటి వరకు రూ.3,58,000 కోట్ల ప్రజాధనాన్ని దిగమింగారని నిమ్మల పవర్ పాయింట్ ప్రజంటేషన్‌లో వివరించారు.
2004లో రూ.1.65 కోట్లు ఉన్న జగన్ ఆస్తి 2023 నాటికి రూ.3.58 లక్షల కోట్లకు ఎలా ఎగబాకిందో ప్రజలకు సమాధానం చెప్పాలని నిమ్మల డిమాండ్ చేశారు. న్యాయస్థానాల కళ్లుగప్పి పదేళ్లుగా బెయిల్‌పై ఉంటూ జగన్‌రెడ్డి దేశ చరిత్రలోనే సరికొత్త రికార్డు సృష్టించారు. తనపై 38 కేసులున్నాయని జగన్‌రెడ్డే 2019 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారు. వీటిపై 54 డిశ్ఛార్జ్ పిటిషన్లు వేశారు. సదరు కేసుల్లో ఇప్పటి వరకు న్యాయస్థానాల నుంచి ఆయన తెచ్చుకున్న స్టేలు 158. ఇక జగన్‌రెడ్డిపై నమోదైన ఐపీసీ సెక్షన్ల జాబితా కొండవీటి చాంతాడునే మించిపోతుందని నిమ్మల ఎద్దేవా చేశారు. సెజ్‌లు, గనులు, భూములు, కాంట్రాక్టులు తమకు నచ్చినవారికి కట్టబెడితే.. అవి పొందినవారు ప్రతిఫలంగా సాక్షి దినపత్రికలో రూ.1,246 కోట్లు పెట్టుబడులు పెట్టారని నిమ్మల తెలిపారు. తనకు పత్రిక లేదని, టీవీలు అసలే లేవని చెప్పే జగన్‌రెడ్డి ‘సాక్షి’ పుట్టుకపై ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమంగా సంపాదించిన ఆస్తి సాక్షి పత్రిక కాదా? అని ప్రశ్నించారు.